జైషే ఉగ్రవాదానికి కొత్తరూపం- ఆత్మాహుతికి శిక్షణ
- జైషే మహిళా వింగ్‌లో పెరిగిన నియామకాలు
- తాజాగా రూ.500తో 5000 మంది చేరిక !
- ఆత్మాహుతి పై 40 నిమిషాల ఆన్‌లైన్ శిక్షణ
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జైషే చీఫ్ మసూద్ ఎర్రకోట పేలుడు ఘటన దర్యాప్తు చేస్తున్న కొద్ది రోజులకే మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఢీల్లీ పేలుడు కుట్రలో కీలక భాగస్వామి అయిన డా. షాహిన్ షాహిద్ జైషే మహమ్మద్ మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మొమినాత్’ సభ్యురాలని దర్యాప్తు వర్గాలు ఇప్పటికే తేల్చాయి. ఇప్పటివరకు ఈ విభాగంలో 5000 మందికి పైగా చేరినట్లు తాజా సమాచారం. జైషే చీఫ్ మసూద్ అజార్ సోషల్ మీడియాలో గురువారం పోస్ట్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఉగ్రవాద సంస్థ ఉనికిని బలోపేతం చేయడం, మహిళలను నియమించుకొని దాని పరిధిని విస్తరించాలని జైషే మహమ్మద్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్టోబరు 8 నుంచి జైషే ప్రధాన కార్యాలయంలో ఈ మహిళా బ్రిగేడ్ కోసం నియామకాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి . పురుష ఉగ్రవాదుల తరహాలోనే మహిళ ఉగ్రవాదులకు కఠిన శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ లోని బహవల్‌పూర్, ముల్తాన్, సియాల్‌కోట్, కరాచీ, కొట్లీ, ముజఫరాబాద్ ప్రాంతాల నుంచి మహిళలను ఈ బ్రిగేడ్‌లో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రతిరోజూ 40 నిమిషాల పాటు ఆన్‌లైన్‌లో శిక్షణ అందిస్తూ, ఐసిస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలో ఆత్మాహుతి దాడులను చేపట్టేలా ప్రేరేపిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఒక్కో మహిళ నుంచి రూ.500 చొప్పున విరాళాల కింద సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా శిక్షణను సులభతరం చేయాలని, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంతటా జిల్లా స్థాయి సంస్థలను ఏర్పాటు చేయాలని జైషే పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో ఒక మహిళ అధిపతి నేతృత్వంలో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. ఈ బ్రిగేడ్‌లో చేరే మహిళలకు అత్యంత కఠిన రూల్స్ అమలులో ఉన్నాయి. భర్త లేదా కుటుంబసభ్యుడు తప్ప ఇతర ఏ పురుషుడితోనూ మాట్లాడకూడదని స్పష్టమైన ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఈ మహిళా విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నాయకురాలిగా వ్యవహరిస్తుండగా, ఆన్‌లైన్ క్లాసులకు పుల్వామా ఉగ్రదాడుల సూత్రధారి ఉమర్ ఫరూఖ్ భార్య అఫీరా బీబీ నేతృత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 మార్చిలో కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉమర్ హతమవ్వగా, అంతకుముందు ఆపరేషన్ సిందూర్ సమయంలో బహవల్‌పూర్‌లోని జైషే కేంద్రంపై జరిగిన దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందారని గుర్తుచేశారు. ఈ దెబ్బ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న అజార్ ముఠా, కొత్త పన్నాగాలకే శ్రీకారం చుట్టిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
జైషే మహిళా విభాగం ఏర్పాటు పాక్ ఉగ్రవాద రంగంలో గణనీయమైన మార్పును సూచిస్తోందని విశ్లేషకులు తెలిపారు. తీవ్రవాద కార్యకలాపాల్లో మహిళల వినియోగం కొత్త వ్యూహాలకు నాంది పలుకుతోందని అభిప్రాయపడ్డారు.

