పద్ధతి మార్చుకుంటున్న ఎమ్మెల్యేలు
◆ టికెట్లు రావన్న భయంతో నిత్యం ప్రజలతో మమేకం
◆ పనితీరు మెరుగు దిశగా ఆలోచనలు
◆ జగన్ ఎత్తుకు దిగి వచ్చిన ఎమ్మెల్యేలు
◆ అదనపు సమన్వయకర్తల రాకతో అటెన్షన్
ఏపీలో అధికార పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు గడిచిన మూడు సంవత్సరాలుగా ప్రజలలోనే కనపడేవారు కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కనీసం కార్యకర్తలకు కూడా దొరికే వారు కాదు. అధికారంలోకి వచ్చాం మరొక 20 సంవత్సరాలు తిరుగులేదన్న భావనలో వారి వారి కార్యకలాపాలు, వ్యాపారాల్లో బిజీగా గడిపేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచేసరికి ప్రజలలో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న నివేదికలు అధినేత వైఎస్ జగన్‌కి చేరాయి. ఎన్ని సంక్షేమ పథకాలు ఎంత డబ్బులు పంచిపెట్టిన స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగా పార్టీకి మైలేజీ రావటం లేదని గ్రహించిన జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం కేంద్రంగా ఎమ్మెల్యేల అందరిని పిలిచి తన వద్ద ఉన్న నివేదికల వినిపించి పని తీరు మెరుగుపరుచుకోవాలి… లేనిపక్షంలో ఈసారి ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు ఉండదని, గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలకు చేరువ అవ్వాలని హుకుం జారీ చేశారు. జగన్ మాటలను పెడచెవిన పెట్టిన కొంతమంది ఎమ్మెల్యేలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో మరో మారు సమావేశం నిర్వహించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించి కొన్ని నెలల్లో పనితీరు మెరుగుపరచుకోకపోతే మార్పు చేర్పులు తప్పవని మరో మారు హెచ్చరించారు.

దీంతో కొంతమంది ఎమ్మెల్యేల్లో మార్పు వచ్చి తమ పనితీరు మెరుగుపరుచుకునేందుకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకున్నారు. అయినా కూడా జగన్‌కు వస్తున్న నివేదికలలో ప్రభుత్వంపై ప్రజల్లో మంచి స్పందన ఉందని ఎమ్మెల్యేలపై ఇంకా వ్యతిరేకత కొనసాగుతుందని ఉండటంతో జగన్ తాను అనుకున్న పనిని ప్రారంభించారు. మొదటగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ఉన్న కూడా అదనపు సమన్వయకర్త పేరుతో డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించి ఎమ్మెల్యేలు అటెన్షన్ కు వచ్చేలా చేశారు. దీంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా ఉంటు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తూ పనిచేస్తూ వస్తున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరులో క్రమేపి మార్పు వస్తుందని 20 మంది మినహా మిగిలిన వారి పనితీరు మెరుగుపడినట్లు తాజాగా సీఎంకు నివేదికలు అందినట్లు సమాచారం. గతంలో వెనకబడి వార్నింగ్‌లతో పని తీరు మార్చుకున్న ఎమ్మెల్యేలతో జగన్ కూడా ఇటీవలే ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. మీ పని తీరు గతంలో కంటే బావుంది ఇలాగే పని చేయండి అంటూ వారిని వెన్ను తట్టి ప్రోత్సహించినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇంకా పనితీరు మార్చుకొని ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అదనపు సమన్వయకర్తలను త్వరలోనే జగన్ రంగంలోకి దించబోతున్నారట. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో తొందరగా అదనపు సమన్వయకర్తలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసి రాబోవు ఎన్నికల్లో మరల గెలవాలనే తలంపుతో జగన్ ఉన్నారని వినికిడి.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈసారి ఎన్నికల్లో టికెట్ వచ్చినా రాకపోయినా ప్రస్తుతం అదనపు సమన్వయ కర్తలు నియోజకవర్గంలోకి వస్తే తమ పరువు పోతుందనే భయంతో గడపగడపకు కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంన్నాటున్నారు. జగన్ కూడా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటివరకు క్రింది స్థాయి అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా తాజాగా కలెక్టర్లను కూడా భాగస్వామ్యం చేయాలని ఆయన నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వ కార్యక్రమాల్లో వేగం పెరగటంతో పాటు ప్రజల సమస్యలు కూడా పరిష్కారమవుతాయని ఆయన భావిస్తున్నారు. కలెక్టర్లు కూడా నేరుగా పాల్గొంటే స్థానికంగా ఉన్న సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే వీలుంటుందని సీఎం భావిస్తున్నారట. ఇలా చేయడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పై మంచి నమ్మకం ఏర్పడుతుందని ఎన్నికల వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించేలా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ వేసిన ఎత్తుకు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులోకి వచ్చారని, కొంతమేర ప్రజల సమస్యలు తీరుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.