సంక్షేమాన్ని ఓటు బ్యాంకుగా మార్చేలా జగన్ వ్యూహరచన
◆ ఎన్నికలకు సమాయత్తమవుతున్న జగన్
◆ ఎమ్మెల్యేల కంటే జిల్లా అధ్యక్షులుకే ఎక్కువ అధికారాలు
◆ క్షేత్రస్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం గృహాసారథుల నియామకం
◆ సంక్షేమాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే వ్యూహం
◆ సచివాలయాల వారీగా పర్యటనలు
◆ నియోజకవర్గ పరిశీలకులతో వాడివేడిగా జగన్ వర్క్ షాప్
ఏపీలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవటానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం సరికొత్త విధానాన్ని అనుసరించబోతున్నారు. ఆ దిశగా ఒక బలమైన నెట్వర్క్ ను గ్రామంలోని వార్డు స్థాయి నుంచి ఏర్పాటు చేయబోతున్నారు. దీనిలో భాగంగానే గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొత్తగా నియమితులైన నియోజకవర్గ పరిశీలకులు, 26 జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ కీలకమైన సమావేశంలో పార్టీ పరిశీలకులుగా నియమితులైన నేతలకు దిశా నిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని పరిశీలకులు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్ల సమన్వయంతో ఆయా జిల్లాల్లో పార్టీ నీ బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహా సారధులను నియమించాలని అలా రాష్ట్ర వ్యాప్తంగా 5.2 లక్షల మంది గృహ సారధులు అందుబాటులో ఉండాలన్నారు.

అలాగే గ్రామ,వార్డు సచివాలయాల్లో ముగ్గురు పార్టీ కన్వీనర్లను నియమించాలని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల మంది పార్టీ కన్వీనర్లు అందుబాటులో ఉంటే ఆయా సచివాలయ పరిధిలో పార్టీ మరింత బలపడుతుందన్నారు. సచివాలయ కన్వీనర్ల నియామకం డిసెంబర్ 20 లోపు పూర్తి చేయాలని అలాగే నియామకాలు పూర్తి అయిన తర్వాత నెలలో 15 రోజులు పాటు ఇంటింటికి పార్టీ సచివాలయ కన్వీనర్లు వెళ్లేలా చూడాలన్నారు. గడపగడపకు పార్టీని తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఇది ముఖ్యమైన మార్గం అన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు గృహసారధులను నియమించేటప్పుడు వారిలో ఒక పురుషుడు ఒక మహిళ గృహసారధులుగా ఉండాలని,అలానే పార్టీ సందేశాన్ని 50 కుటుంబాలకు చేరవేయటం వారికి తయారుచేసిన పబ్లిసిటీ మెటీరియల్ అందించటం తదితర కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని జగన్ పరిశీలకు సూచించారు.

గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కూడా పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారని వీరిలో కనీసం ఒకరు మహిళ ఉండేలా నియామకం చేపట్టాలని వీరు సంబంధిత గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పార్టీ కార్యక్రమాలు చూస్తారన్నారు. దీంతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి గెలుపొందాలన్నదే సీఎం జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అందుకోసం పార్టీ పరంగా ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నారని అందులో భాగంగానే పరిశీలకులతో తొలిసారిగా సమావేశం నిర్వహించి వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలని అందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించినట్లు అంటున్నారు.

ఈ సమావేశంతో జగన్ ఎన్నికలకు పూర్తిగా సమాయత్తమైనట్లేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల కంటే పార్టీ జిల్లా అధ్యక్షులు పైనే ఆయన ఎక్కువ విశ్వాసం ఉంచినట్లు కూడా తేటతెల్లమవుతుందని రానున్న ఎన్నికల్లో టికెట్లు ఖరారు కూడా జిల్లా అధ్యక్షుల సూచనలకు అనుగుణంగానే ఉండబోతున్నాయని కూడా అంటున్నారు. జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు నియోజకవర్గ పరిశీలకులు పనిచేయనున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా జిల్లా అధ్యక్షులకే ఎక్కువ అధికారాలు లభించాయి. క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్ట పరచడం ద్వారా ఇంతవరకు సంక్షేమానికి ప్రాధాన్యతను ఇచ్చిన జగన్ ఇప్పుడు పూర్తిగా ఆ సంక్షేమాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రక్రియను స్పష్టంగా అర్థం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.