చంద్రబాబును ఇలా జగన్ ఇప్పటి వరకు కామెంట్ చేయలేదంటే నమ్మండి..!
జాబురావాలంటే.. బాబు రావాలని చంద్రబాబు మళ్లీ చెప్తున్నాడు
టీడీపీ అధినేత చంద్రబాబుపై అనంతపురంలో జరిగిన వసతి దీవెన బహిరంగ సభలో నిప్పులు చెరిగారు సీఎం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు చెప్పే మాటలు వింటే మరోసారి మోస పోవాల్సి వస్తోందన్నారు. గతంలో ఇచ్చిన హామీలు వేటిని చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎన్నటికీ బుద్ధి రాదని గతాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. బ్యాంకుల్లో బంగారం తిరిగి రావాలంటే, బాబురావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, బాబు రావాలని ప్రకటనలు ఇచ్చాడని కానీ ఏం చేశాడని జగన్ ప్రశ్నించాడు. ఉద్యోగం రాకపోతే…. నెలానెలా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ప్రతి ఇంటికీ చంద్రబాబు సంతకాలతో లేఖలు పంపాడన్నారు. రైతులకు రూ. 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని మొట్ట మొదటి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేటా ముంచాడన్నారు. బ్యాంకుల్లోని బంగారం సంగతి దేవుడెరుగు, ఆ బంగారాన్ని వేలం వేయడానికి కారకుడయ్యాడన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి, పొదుపు సంఘాలకు రూ.14, 200 కోట్లు మాఫీ చేయలేదన్నారు. 60 నెలల్లో ప్రతి ఇంటికీ రూ.2వేల చొప్పున లక్షా 20 వేలు చంద్రబాబు బాకీపడ్డారని జగన్ చెప్పారు. ఎన్నికలకు 2 నెలల ముందు కేవలం 3 లక్షల మందికి ఇచ్చి.. చేతులు దులుపుకున్నాడన్నారు. జగన్‌ను తట్టుకోలేమని.. కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు పింఛన్ పెంచాడని, ఇదే పెద్ద మనిషి మళ్లీ టేప్ రికార్డర్ ఆన్‌చేశాడని ఇవే డైలాగులు మళ్ళీ చెప్తున్నాడని ప్రజల జ్ఞాపకశక్తితో ఆడుకుంటున్నాడని జగన్ ధ్వజమెత్తారు.
ఆశ చూపి చంపే పులిలా చంద్రబాబు..
ఒక ముసలాయన.. ఈ మధ్య జాతీయ మీడియాలో వచ్చి రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాటలు వింటుంటే.. నాకొక కథ గుర్తుకొస్తోందన్నారు జగన్. మనందరికీ ఇష్టమైన, నీతిని పంచే పంచ తంత్రంలోని కథ చెప్పారు జగన్. అనగనగా ఓ పులి ఉండేదని, మనిషి మాంసం పద్ధతి ప్రకారం రెగ్యులర్‌గా తినేదన్నారు. సంవత్సరాలుగా నరమాంసం తినేందుకు అలవాటుపడ్డ పులి.. ఏళ్లు గడిచేకొద్ది ముసలిదై, వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక లేక, నాలుగు నక్కలను తోడేసుకొని, మనుషుల్ని ఎలా తినాలనే ప్లాన్ వేసుకుందట. మడగు పక్కన కూర్చుని.. వచ్చిపోయే మనుషులకు నగల్ని ఆశ చూపేదట అంటూ జగన్ స్టోరీ చెప్పారు. “కడియం కావాలంటే నీటిలో మునగాలి” అంటూ ఊరించేదట. “ఈ పులిని నమ్మితే.. తినేస్తుంది కదా” అని అందరూ నమ్మకుండా పోయారట. కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్ మోస్ట్ పులిని. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అందంట. గతంలో బాగా తినేవాడిని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదంటుందట. వయసు పెరిగిందని, రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నానందట. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేయగా… బురదలో ఇరుక్కోగానే, వారిని పులి చంపి తినేసేదట. ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు ఆడేవారిని, వంచకుల్ని, మాయమాటలు చెప్పేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదంటూ చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు. అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడంటూ చంద్రబాబును జగన్ గుర్తు చేశారు. వేటాడే శక్తి కోల్పోయిన పులి, గుంట నక్కల్నివెంటేసుకుని తిరిగినట్లు ఉందన్నారు చంద్రబాబు తీరు. బంగారు కడియం ఇస్తానంటాడు. జాబు రావాలంటే బాబు రావాలంటా.. బాబుకు ఎప్పటికీ బుద్ధిరాదని అనిపిస్తోందన్నారు జగన్. నేను సీనియర్‌ని, ఇప్పుడు మంచోడ్ని అయ్యానంటూ నమ్మించే యత్నం చేస్తాడన్నారు. కానీ, చంద్రబాబు లాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదని సీఎం జగన్ అన్నారు.