Andhra PradeshHealthHome Page Slider

చిలకలూరిపేటలో  ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును ప్రారంభించిన జగన్

దేశచరిత్రలోనే వైద్యంరంగంలో కనీవినీ ఎరుగని పనులకు శ్రీకారం చుట్టామని జగన్ తెలిపారు. ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని ఈ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మొదలు పెడుతున్నామని, రేపటి నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ కోసం ఎక్కడికీ వెళ్లనక్కరలేదని, పేదల ఇళ్లకే డాక్టర్లు వచ్చి వైద్యసేవలు అందిస్తారని, ఇలా ఏ రాష్ట్రంలోనూ లేదని, ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టామన్నారు. హాస్పటల్స్ చుట్టూ పేదలు తిరగనక్కరలేదని, ప్రతీ గ్రామంలో ల్యాబ్‌లు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంచాన పడి ఉన్న వారికి కూడా వైద్యులను ఇంటికి పంపిస్తామని, అవసరమైన అన్ని పరీక్షలు చేయిస్తామని భరోసా ఇచ్చారు. పెన్షన్లు ఎలా అయితే ఇంటింటికీ అందిస్తున్నామో అలాగే వైద్యాన్ని కూడా ఇంటిటికీ తిరిగి అందిస్తామన్నారు.

ప్రతీ గ్రామంలో  బీపీలు, షుగర్లు, రక్తహీనత, విటమిన్ లోపాలు ఎంతమందికి ఉన్నాయో, దీర్ఘకాలిక వ్యాధులు ఎంతమందికి ఉన్నాయో సర్వేలు చేయిస్తామని,  క్యాన్సర్లు, ఎయిడ్స్ వంటి పరీక్షలు కూడా చేస్తామన్నారు. ఈ విధానం దేశం మొత్తానికీ రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఏ పేదవాడూ వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదని, వైయస్సార్ విలేజ్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు  ఉచితంగా అందజేస్తున్నామన్నారు. తొలిదశలోనే రోగాన్ని గుర్తించి అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిపుణులైన వైద్యులతో కూడా మాట్లాడి వ్యాధి నయం చేయిస్తామన్నారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ద్వారా వైద్యుడు వ్యక్తిగతంగా రోగులతో సంబంధం ఏర్పడుతుందన్నారు.