Andhra PradeshHome Page Slider

రేవంత్, చంద్రబాబు కుట్రలో షర్మిల భాగమైందన్న జగన్… ఇండియాటుడే ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు

(Courtesy India Today)

ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన చెల్లెలు షర్మిల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కారుకు తాను ఎంతగా సహాయపడుతున్నప్పటికీ పొత్తు లెక్కలు తేలకపోవడానికి మైనార్టీ ఓట్లేనా, లేదంటే ఇంకేమైనా కారణాలున్నాయా అంటూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశ్ ప్రశ్నించగా అందుకు జగన్ ఘాటుగా బదులిచ్చారు. ఐదేళ్లుగా ప్రధాని మోదీతో సంబంధాలపైనా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య సంబంధాల గురించి బీజేపీ పెద్దలనే అడగాలని, లేదంటే, చంద్రబాబును.. ఆ రెండు పార్టీల మధ్య సంబంధం గురించి అడగాలన్నారు.

అభివృద్ధి కోసం కలిశామని చంద్రబాబు చెప్పారని రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పగా అందుకు జగన్ కౌంటర్ ఇచ్చారు. వాళ్లిద్దరూ చేసేది అభివృద్ధి, నేను కేంద్రంతో సుహృద్భావ వాతావరణం మధ్య మద్దతిస్తే మరోటా అంటూ జగన్ ప్రశ్నించారు. ఒకవేళ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీకి 20 సీట్లు తగ్గితే, మీ వద్ద 20 ఎంపీలుంటే మీరేం చేస్తారని రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశ్నించగా, ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలనన్నారు. తన చెల్లెలు షర్మిల ఎన్నికల్లో పోటీ చేయడంపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేయడంపై తాను బాధపడటం లేదన్నారు. కాకుంటే ఆమెకు ఎన్నికల్లో డిపాజిట్లు రావడం లేదని బాధగా ఉందన్నారు. అదే తనను ఎక్కువ బాధిస్తోందన్నారు. షర్మిల చేస్తోంది కరెక్ట్ కాదన్నారు జగన్.

కాంగ్రెస్ పార్టీ తన తండ్రి పేరుని చార్జ్ షీట్‌లో పెట్టిందన్నారు. అదే పార్టీ తనపై తప్పుడు కేసులు పెట్టిందన్నారు. తనపై కేసులకు కారణం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలేనన్నారు జగన్. ఏపీలో కాంగ్రెస్ పార్టీని డ్రైవ్ చేస్తోంది చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి అంటూ జగన్ బాంబు పేల్చారు. ఏపీలో తనను దెబ్బకొట్టాలని చంద్రబాబు, రేవంత్ రెడ్డి, షర్మిలను ఏపీకి తెచ్చి తనపై ఉసిగొల్పారని జగన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రిమోట్ కంట్రోల్ చంద్రబాబు వద్దే ఉన్నాయన్నారు. తాను ఒక్క బీజేపీతో మాత్రమే కాదని జగన్ కాంగ్రెస్ పార్టీతో కూడా పోరాడుతున్నానన్నారు.

నోట్- ఈ రోజు రాత్రి పదిన్నర గంటలకు సీఎం జగన్ ఇంటర్వ్యూ ఇండియా టుడేలో ప్రసారం అవుతుంది.