విజయవాడ వరదలో అడుగడుగునా జగన్
విజయవాడ నగరాన్ని ఎన్నడూ లేని రీతిలో వరద ముంచెత్తింది. గతంలో ఎప్పుడూ ముంపుకు గురికాని ప్రాంతాలు కూడా ఇప్పుడు వరద నీళ్లలో అల్లాడుతున్నాయి. ఈ సందర్భంలో సామాన్య ప్రజల నోట మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు బాగా వినిపిస్తోంది. గత ఐదేళ్ల జగన్ పరిపాలనను బాగా గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుని ఉండేవారో చర్చించుకుంటున్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలు తమకు ప్రభుత్వ సహాయం అందడం లేదని గురువారం రాత్రి రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. నాలుగు రోజుల నుండి ఆహారం, త్రాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్సులే వరద బాధితులను ఆదుకుంటున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా జగన్ హయాంలో తెప్పించిన 108 వాహనాలే కనిపిస్తున్నాయి. అప్పట్లో ప్రజలకు ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం ఉపయోగించిన వాహనాలలోనే ఇప్పుడు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్‌ను ఇంటింటికీ సరఫరా చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నప్పటికీ ఎక్కడా అందడం లేదని బాధితులు పేర్కొన్నారు.

చంద్రబాబు రాజధాని ప్రాంతంగా ప్రకటించిన అమరావతి ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైకోర్టు, సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి. రహదారులన్నీ నీటితో నిండిపోయి పూర్తిగా రాకపోకలు బందయ్యాయి. జగన్ హయాంలో కట్టిన రిటైనింగ్ వాల్ కృష్ణలంక ప్రాంతం నాశనం కాకుండా కాపాడిందని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. జగన్ పర్యటన సందర్బంగా అక్కడి ప్రజలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 3.44 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజి కింద కట్టిన ఈ రిటైనింగ్ వాల్ ఆరు డివిజన్లకు రక్షణ ఇచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకుని ఈ వాల్ నిలబడింది.

వాతావరణ శాఖ ముందుగా ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోని బాబు సర్కార్ ఇప్పుడు సహాయక చర్యల విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. వరదలలో తిరుగుతున్నానంటూ ఫోటోలకు ఫోజులిచ్చిన ముఖ్యమంత్రి, తన ఇల్లు కూడా మునిగిపోయిందంటూ వ్యాఖ్యానించారు. విజయవాడ పూర్తిగా మునిగిపోయిందని, అలాగే మా ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చాయని అసహనం ప్రదర్శించారు.

మరోపక్క విజయవాడ వరదలకు మానవ తప్పిదాలే కారణమని వైసీపీ నేత జగన్ తేల్చి చెప్పారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డారు. బాధితులకు కనీసం ఆహార సరఫరా కూడా చేయలేకపోయారని, ఇంత దారుణ పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. బుడమేరు వరద కారణంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయకుండా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి 11 లాక్‌లు ఎత్తేశారని, ఈ కారణంగానే విజయవాడ ముంపుకు గురయ్యిందని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వంలో వాలంటీర్ల సైన్యం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇంటింటికీ సహాయం అందించడం చాలా సులభమయ్యేదని జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ కాలంలో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ చక్కగా పని చేసేదని, నిత్యం ప్రజలతో మమేకమై ఉండేదని పేర్కొన్నారు. ప్రజలకు ముందు జాగ్రత్తలు సూచించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు అన్నీ ప్రణాళిక ప్రకారం సంతృప్తికరంగా జరిగిపోయేవని జగన్ పేర్కొన్నారు. వరద ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులకు ప్రతీ క్షణం అందుబాటులో ఉంటానని, బాధితుల తరపున పోరాడతానని, తగిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

