జగన్ ఇచ్చేది గోరంత..దోచుకునేది కొండంత : చంద్రబాబు
పేదరికంలేని రాష్ట్రాన్ని నిర్మిద్దాం అనుకున్నా అదే లక్ష్యంగా పనిచేశానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జరిగిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు అంటే గుర్తొచ్చేది కోడెల శివప్రసాద రావు అని ఆయన పల్నాటి పులి అని ఆయన ఎవరికీ భయపడలేదని చెప్పారు. కోడెల అంటే అభివృద్ధి అని, అభివృద్ధి అంటే కోడెల అని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు పాలు చేశారని, తన పాలనలో ఆనాడు రాష్ట్రం 16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద ప్రజల కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం ఉన్నతమైన విద్యను ప్రభుత్వం ద్వారా అందించానని చంద్రబాబు చెప్పారు. నైపుణ్యాలకు తగ్గట్టుగా యువతకు మంచి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని కోటీశ్వరులు చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పనిచేశామన్నారు. భవిష్యత్తు తరాల బంగారు బాట కోసం తాను ఎప్పుడూ కృషి చేస్తానని అన్నారు.

ఆ రోజు విదేశీ విద్య కోసం తాను కృషి చేస్తే ఈ ప్రభుత్వం విదేశీ విద్యను రద్దు చేసిందని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం అరాచకాలకు అవినీతికి అడ్డాగా మారిందని ఇచ్చేది గోరంత అని తీసుకునేది కొండంత అని ఎద్దేవా చేశారు. ఏపీలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని అన్నారు.