వంశీ అరెస్టుపై మండిపడ్డ జగన్..
కక్షలు తీర్చుకోవడానికే వ్యవస్థలను వాడుకుంటున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అధికార దుర్వినియోగంతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. గన్నవరం కేసులో టీడీపీనే తనతో తప్పుడు కేసు పెట్టించిందంటూ వాంగ్మూలం ఇచ్చిన దళిత యువకుడిని బెదిరించి, భయపెట్టారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన వంశీని చట్ట వ్యతిరేఖంగా ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. దిగువ కోర్టు కేసును విచారిస్తోందని, దర్యాప్తును, న్యాయప్రక్రియను అపహాస్యం చేసేలా ఈ అరెస్టు ఉందన్నారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య ఏర్పడినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.