ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం..కాశ్మీర్‌లో యోగా చేసిన ప్రధాని మోదీ
నేడు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని దాల్ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ చొరవ వల్ల 2015 సంవత్సరంలో యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఆయన కోరిక మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 10 ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును పద్మశ్రీతో సత్కరించినట్లు మోదీ తెలిపారు. ఆమె యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. యోగా ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని, ఎందరో దేశాధినేతలు తనని అడిగి యోగా ప్రాముఖ్యతను తెలుసుకున్నారని వివరించారు. యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు నిర్వహించారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ కూడలిలో వేలమంది ఆసనాలు వేసి యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.