NewsTelangana

రాష్ట్ర భవిష్యత్తును మునుగోడు నిర్ణయిస్తుంది

మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఈ ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని, మునుగోడు ప్రజలు న్యాయం వైపే ఉంటారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌ రెడ్డి సోమవారం నామినేషన్‌ వేశారు. మునుగోడు క్యాంప్‌ ఆఫీసు నుంచి చండూరు ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి.. రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా డబ్బు సంచులతో ఊరూరా తిరుగుతున్నారని.. ఇక్కడి ప్రజలు మాత్రం ధర్మం వైపే నిలబడతారనే ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌.. నాపై పోటీ చేయ్‌..

నల్గొండ జిల్లా విప్లవాల ఖిల్లా అని, తమను దొంగ దెబ్బ తీసేందుకు కేసీఆర్‌ వేస్తున్న ఎత్తుగడలన్నీ చిత్తు కావడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చెప్పారు. కేసీఆర్‌కు లేదా కేటీఆర్‌కు దమ్ముంటే మునుగోడులో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. దేశమంతా మునుగోడు గురించే చర్చిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భూపేందర్‌ యాదవ్‌, కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, బీజేపీ మునుగోడు స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ వివేక్ వెంకటస్వామి, పార్టీ సీనియర్‌ నాయకులు ఈటల రాజేందర్‌, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలు సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ చుగ్‌తో పాటు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.