అమూల్యమైన సుప్రీం కోర్టు సమయాన్ని వృధా చేయడమే
బీబీసీ సీరిస్ నిషేధంపై కేసు వేయడం దానిపై విచారించడమన్నది… సుప్రీం కోర్టు సమయం వృధా చేయడమేనన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు. గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయం ఉందంటూ ప్రసారమైన బీబీసీ క్లిప్పులను ఇండియాలో నిషేధించడంపై దాఖలపై పిటిషన్‌లను వచ్చే వారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టనున్న సమయంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బీబీసీ సీరిస్ నిషేధంపై పిటిషన్లు వేయడమంటే… గౌరవ సుప్రీం కోర్టు సమయాన్ని వృధా చేయడమేనని… ఎందరో సుప్రీం కోర్టు తీర్పుల కోసం వేచి ఉన్నారని ట్విట్టర్లో కామెంట్స్ చేశారు.
“ఇండియా: ది మోడీ క్వశ్చన్” పేరుతో ఉన్న ఈ సిరీస్‌ను ప్రభుత్వం పక్షపాతంతో కూడిన ప్రచారంగా కొట్టిపారేసింది, సోషల్ మీడియాలో ఎలాంటి క్లిప్‌లను భాగస్వామ్యం చేయడానికి వీళ్లేకుండా బ్లాక్ చేసింది. ఐటి నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న అత్యవసర అధికారాలను ఉపయోగించి క్లిప్‌లను షేర్ చేయకుండా నిరోధించడానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రభుత్వ సలహాదారు కంచన్ గుప్తా ట్విట్టర్‌లో తెలిపారు.
ఐతే సీరిస్ కఠిన పరిశోధనలతోపాటుగా BJP నుండి ప్రతిస్పందనలతో సహా అనేక భిన్న స్వరాలను అందించిందని బీబీసీ పేర్కొంది. ఈ పిటిషన్లను వచ్చేవారం సుప్రీంకోర్టు విచారిస్తుందని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టుకు వేసిన పిటిషన్‌లలో ఒకదానిలో ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు. డాక్యుమెంటరీకి సోషల్ మీడియా లింక్‌లను తీసివేయాలన్న ఉత్తర్వుపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్, జర్నలిస్ట్ ఎన్ రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వేసిన ప్రత్యేక పిటిషన్ ఈ వారం చివరిలో విచారణకు రానుంది. నిషేధాన్ని నిరసిస్తూ భారతదేశం అంతటా వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు డాక్యుమెంటరీ బహిరంగ ప్రదర్శనలు నిర్వహించాయి. చాలా కాలేజీల్లో కాలేజీ అధికారులు, పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు, మరికొందరిని కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు.

