“ఇదేనా ఇందిరమ్మ రాజ్యం. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి”..మాజీ మంత్రి డిమాండ్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరిన అరికెపూడి గాంధీ వర్గీయులు రభస సృష్టించడంతో గాంధీని అరెస్టు చేసి, అక్కడ నుండి తరలించారు పోలీసులు.
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. మా పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించి, పార్టీలో చేర్చుకుని వారితోనే మా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేస్తున్నారంటూ విమర్శించారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతోనే, రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే ఇది జరిగిందని ఆరోపిస్తూ ట్విట్ చేశారు హరీష్ రావు.

