Andhra PradeshNewsNews Alert

సీటుకు గ్యారెంటీ ఉందా..? బాబుకు ఎదురు ప్రశ్న

బాబు పరుగులు పెట్టమంటున్నాడు. కానీ.. వారంతా ఆలోచిద్దామంటున్నారు. ఇక సమయం లేదు కార్యరంగంలోకి దూకాల్సిందే. ఇప్పటి నుండే పని చేస్తే, వచ్చేది మన ప్రభుత్వమే అని బాబు లెక్కలు కడుతున్నాడు. ఓ ధైర్యాన్నిచ్చి ముందడేగమంటున్నాడు. కానీ.. కదలికలో స్పీడ్ తగ్గింది. ఆచరణలో వెనకడుగులు పడుతున్నాయి. ప్రతిదీ స్కాన్ చేశాక చూద్దాంలే అన్న నిర్లక్ష్యపు విధానం తొణికిసలాడుతోంది. ఎందుకిలా.. ఎక్కడ లోపం.. బాబు మాటకు గౌరవం తగ్గిందా.. ? అసలు క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదేంటి? ఎందుకీ ఊగిసలాట ?

ఎన్నో అవమానాలు. తట్టుకోలేని విమర్శలు. అపవాదులు, నిందలు. గత ఎన్నికల్లో అధికారం చేదాటి పోయిన దగ్గర నుండి టీడీపీ అధినేత చంద్రబాబు పడని కష్టం అంటూ లేదు. వీటన్నింటినీ ప్లస్ గా మార్చుకుని .. ప్రజా సానుభుతితో తిరిగి అధికారంలో రావాలని ఓ ప్లాన్. తనపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత దూషణలు.. పార్టీ పని అయిపోయిందని చేస్తున్న ప్రచారం.. . దీనికి తోడు గత ఎన్నికల్లో వైసీపీ 151 స్ధానాల్లో విజయం సాధిస్తే .. టీడీపీ కేవలం 23 నియోజకవర్గాల్లోనే గెలుపొందడం వంటివి తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. . ఆ తర్వాత ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా సభలో మాట్లాడే అవకాశం కూడా సరిగ్గా ఇవ్వని పరిస్ధితి. తమ పార్టీ నేతలపై అనేక కేసులు మోపి .. జైళ్ళకు పంపడం.. తీవ్రంగా వేధించడం వంటివి కూడా నిద్ర పట్టనివ్వలేదు. ఇక సొంత నియోజకవర్గం కుప్పంలో పెద్ద ఎత్తున జరిగిన దాడులు టీడీపీ వర్గాలను తీవ్రంగా కలవర పరిచాయి. ఈ అంశాలన్నీ ఇప్పుడు తమకు పెద్ద ఎత్తున సానుభూతిని తీసుకు వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే జరగరాని నష్టం ఎంతో జరిగింది. కరుడుగట్టిన తెలుగుదేశం వాదులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది పార్టీని కాదని వెళ్ళి పోయారు. ఉన్న వారిపై అన్ని రకాల వేధింపులు కొనసాగుతున్నాయని ఆ పార్టీ నేతల భావన.

ఒకవైపు తమ పార్టీపై జరుగుతున్న దాడులు.. మరోవైపు అధికార పార్టీ తప్పిదాలు.. ఆ పార్టీ నేతలపై వస్తున్న విమర్శలు తమకు ఎంతో మేలు చేస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. వాటన్నింటిని ఓట్లుగా మలుచుకుని తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలన్నది తెలుగుదేశం వ్యూహం. దీనికి తోడు బీజేపీ, జనసేనలతో పొత్తు కోసం జరుపుతున్న ప్రయత్నాలు ఫలిస్తే .. సునాయసంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమన్న ధీమా. ఈ క్రమంలోనే పార్టీలోని అన్ని స్ధాయిల నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ .. కదన రంగంలోకి దింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే కిందిస్ధాయి నేతలు, కార్యకర్తలు స్పందిస్తున్న తీరు భిన్నంగా కనిపిస్తోంది. అలాంటి వారిని గుర్తించి వారికి నచ్చ చెప్పేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. వారికున్న సమస్యలు తెలుసుకుని .. ఎందుకు వారు మందకొడిగా పని చేస్తున్నారో విశ్లేషిస్తున్నారు. ఆ సమయం వస్తే ఆలోచిద్దాంలే అన్న ఆలోచనతోనే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్న వారు ప్రజలతో మమైకమై కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు ఎప్పటికప్పుడు పోరుతున్నా .. చాలా మంది పెడచెవిన పెడుతున్నారని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఇక పొత్తులంటూ ఖరారు అయితే తమ సీటు ఎవరికి కేటాయిస్తారో అని చాలా మంది పార్టీ కోసం ఖర్చు పెట్టడం, శ్రమించడం లాంటివి చేయడం లేదని వినిపిస్తోంది. ఖర్చు పెట్టడానికి సిద్ధమే .. కానీ సీటుకు గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించే వారూ ఉన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో వారందరికీ హితోపదేశం చేసి .. పార్టీ కోసం ముందుకు కదిలించేందుకు బాబు అనేక ప్రయాసలు పడాల్సి వస్తోంది. పొత్తులు గురించి ఆలోచన చేయొద్దని బాబు అంటున్నా .. మరి భవిష్యత్ ఏంటీ అన్నదే వారి ప్రశ్న.

రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఓ అగ్ని పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గాల్సిందే. విజయం సాధించాల్సిందే. వైసీపీ అహంకారాన్ని అడ్డుకోవాల్సిందే. ఇదే భావన తెలుగుదేశంలో బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఉపేక్షించినా.. జాగు చేసినా .. అడుగులు తడబడినా ఇక పార్టీ కోలుకోవడం కూడా కష్టమేనన్న భయం తెలుగుదేశంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే పక్కాగా.. పకడ్బందీగా వ్యూహ రచన చేస్తోంది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను కూడా ఖరారు చేసి .. వారికి మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే గతంలో అనేక పోరాటాలను నిర్వహించిన నేతలు, కార్యకర్తలు ఇప్పుడు ధైర్యంగా బయటకు రాలేని పరిస్ధితి. పోరాటాలతో రోడ్డెక్కలేని దుస్ధితి. నో ఫికర్. రానున్నది మన ప్రభుత్వమే. ధైర్యంగా రోడ్లెక్కండి .. పోరాటాలకు దిగండి.. ఆందోళనలు చేయండి అంటూ కార్యకర్తలకు నూరి పోస్తున్నా.. ఆ.. చూద్దాంలే అన్న ధోరణే కింది స్ధాయిలో కనిపిస్తోంది. మరి బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా.. ? తిరిగి అధికారం దక్కించుకోవడం సులభమేనా.. ? బిజేపీ, జనసేనతో పొత్తులు బాబుకు ఉపకరిస్తాయా..? ఒకవేళ వారితో కలిసి అధికారాన్ని దక్కించుకుంటే సీఎం పీఠంపై బాబు సునాయాసంగా కూర్చోగలుగుతాడా..? అది సాధ్యమేనా.. ? ఇందుకు ఆ రెండు పార్టీలు అంగీకరిస్తాయా.. ? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు ఉదయిస్తున్నాయి.

బీజేపీ.. జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆయా పార్టీలకు పోయే నియోజకవర్గాలు ఎన్ని. టీడీపీకి మిగిలేవెన్ని. ఇప్పటికే నేతలు ఎన్నో ఆశలు పెంచుకున్న నియోజకవర్గాల్లో తెగించి పనులు చేయలేక పోతున్నారు. టికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారిలో చాలా మంది.. పార్టీ కోసం రూపాయి కూడా ఖర్చు చేయని స్ధితి కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పటి నుండే లక్షలు తగలేస్తే .. రేపు ఆ సీటు తనకు వస్తుందో రాదో అర్ధంకానీ పరిస్ధితి. అందుకే అధినాయకత్వం వెంటపడి తరుముతున్నా… నేతలు కొద్దిగా ఆలోచనలో చేస్తున్నారు. చూద్దాం.. భవిష్యత్ లో ఏం జరగబోతోందో.