మన సైన్యం బలహీనంగా ఉందా..?
సరిహద్దుల్లో ఓ వైపు పాకిస్థాన్.. మరోవైపు చైనా మనకు చికాకు కలిగిస్తున్నాయి. పాకిస్థాన్‌కు గట్టి జవాబు ఇవ్వగలుగుతున్నాం. చైనా దూకుడును మాత్రం నిలువరించలేకపోతున్నామని విమర్శలొస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన సైనిక దళాల్లో ఒకటైన భారత్.. చైనా దూకుడును ఎందుకు అరికట్టలేకపోతోంది. సైనిక రంగానికి మోదీ సర్కారు ఎంతగా ప్రాధాన్యత ఇచ్చినా డ్రాగన్‌ను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాం..? మన సైన్యం నిజంగా పటిష్టంగానే ఉందా..? ఆయుధ సంపత్తి, సైనికుల మానసిక స్థయిర్యం, శిక్షణా సామర్థ్యం, ఆధునిక టెక్నాలజీ.. ఇలాంటి రంగాల్లో చైనా కంటే మనం ముందున్నామా..? వెనుకబడ్డామా..? అసలు మోదీ 8 ఏళ్ల పాలనలో సైనిక రంగంలో మనం బలపడ్డామా..? బలహీనమయ్యామా..?

మేక్ ఇన్ ఇండియా కొంప ముంచుతోందా..
ప్రధాని మోదీ తరచూ చెప్పే మాట మేక్ ఇన్ ఇండియా. అన్ని ఉత్పత్తులూ దేశంలోనే జరగాలన్నది మోదీ లక్ష్యం. రక్షణ రంగంలోనూ మేక్ ఇన్ ఇండియాను అమలు చేస్తామని.. మన దేశానికి అవసరమైన ఆయుధ సంపత్తిని దేశంలోనే తయారు చేస్తామని ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. మన త్రివిధ దళాలన్నీ మోదీ హయాంలో అత్యంత శక్తివంతంగా తయారయ్యాయని ప్రజలు కూడా నమ్ముతున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశంలో తయారు చేసిన ఆయుధ సామాగ్రినే మన సైనికులు వినియోగిస్తున్నారని భావిస్తున్నారు.

హెలికాప్టర్ల కొరత..
అయితే.. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందనే సంచలన విషయం తాజా నివేదిక ద్వారా తెలిసింది. ఆ నివేదిక ప్రకారం.. సైన్యంలో కాల పరిమితి తీరిపోయిన అత్యంత కీలకమైన ఆయుధాల స్థానంలో మన రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త వాటిని అందించలేకపోతోంది. త్రివిధ దళాలకు 2026 నాటికి హెలికాప్టర్ల కొరత తీవ్రమవుతుంది. 2030 నాటికి ఫైటర్ జెట్ల సంఖ్య కూడా భారీగా తగ్గుతుంది. మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఉత్పాదక రంగంలో 30-60 శాతం దేశీయ వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. రక్షణ రంగంలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని భావించడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. గతంలో రక్షణ రంగానికి చేసే ఖర్చులో అవసరమైన వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని.. కొన్నింటిని మాత్రం స్వదేశంలో తయారు చేసేవారు. దీంతో సైనికులకు కొరత లేకుండా ఉండేది.

చైనా కంటే బలహీనమా..?
గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత సరిహద్దుల్లో మన సైనిక దళాలను మరింత బలోపేతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చైనాతో పోల్చుకుంటే భారత సైన్యం బలహీనంగా ఉంది. చైనా దురాక్రమణను నివారించేందుకు హెలికాప్టర్లతో పహారాను పెంచాల్సి ఉంది. కానీ.. హెలికాప్టర్ల కొరత వల్ల మన సైన్యం ఆ పని చేయలేకపోతోంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కొన్ని రక్షణ వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. కానీ.. డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములు, ట్విన్ ఇంజన్ ఫైటర్లు వంటి కీలక సంపత్తిని పెంచుకోలేని దుస్థితి నెలకొంది.

ఇలా అయితే కష్టమే..
సింగిల్ ఇంజిన్, ట్విన్ ఇంజిన్ యుద్ధ విమానాలను స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. దీంతో విదేశాల నుంచి అత్యాధునిక యుద్ధ సామాగ్రి, హెలికాప్టర్లు, యుద్ధ విమానాల దిగుమతిని నిలిపివేసింది. ముఖ్యంగా వైమానిక దళం పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. 2030 నాటికి భారత వైమానిక దళంలో ఫైటర్ స్క్వాడ్రన్‌లు 30లోపే ఉంటాయి. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ కావాలంటే కనీసం 42 ఫైటర్ స్క్వాడ్రన్లు అవసరమవుతాయి. పాతబడిన అర డజను స్క్వాడ్రన్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో స్వదేశంలోనే తయారైన ఫైటర్ స్క్వాడ్రన్లను మాత్రమే వినియోగించాలంటే సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల కంటే బలహీనంగా మారతామని సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికీ కాలం చెల్లిన ఆయుధ సంపత్తే..
బెంగళూరులో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఏడాదికి 8 స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలను మాత్రమే తయారు చేస్తుంది. ఫైటర్ స్క్వాడ్రన్‌లో ఇది సగం మాత్రమే. 2026 నాటికి ఉత్పాదకతను రెట్టింపు చేయాలని హెచ్‌ఏఎల్ భావిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల వాటి తయారీకి అవసరమైన సాంకేతికతను, ఇతర పరికరాలను రష్యా అందించలేక పోతోంది. మన వైమానిక, ఆర్మీ, నౌకా దళాలు ఇప్పటికీ 1970లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన తేలికపాటి హెలికాప్టర్లనే వినియోగిస్తున్నాయి. వీటి కాలపరిమితి ముగిసిందని, వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయలేకపోతున్నామని నివేదిక పేర్కొన్నది. అదే సందర్భంలో మోదీ సర్కారు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలనుకుంటున్నఆయుధ సంపత్తి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు సరిపోవడం లేదు. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి కొన్ని సంవత్సరాల పాటు ఓపిక పడితేనే.. విదేశీ పరిజ్ఞానాన్ని మనవాళ్లకు నేర్పిస్తేనే స్వదేశీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయగలమని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అప్పటి వరకు విదేశాల నుంచి ఆయుధాల దిగుమతిని కొనసాగించాలని సూచిస్తున్నారు.


 
							 
							