కామారెడ్డిలో పోటీపై కేసీఆర్ నిర్ణయం కరెక్టేనా?
ఇప్పుడు అందరి కళ్లూ కామారెడ్డిపైనే. సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తోండటం, గులాబీ పార్టీకి కంచుకోటలా ఉన్న కామారెడ్డిలో అసలేం జరగబోతుందన్నదానిపై ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి గంపా గోవర్ధన్ ఇప్పటి వరకు ఐదుసార్లు గెలిచారు. గులాబీ పార్టీకి కేక్ వాక్‌లా భావించే కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఈసారి బరిలో దిగడం ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి విజయం సాధించిన కేసీఆర్, ఈసారి కామారెడ్డికి ఎందుకు వస్తున్నారన్న దానిపై ఎంతో చర్చ సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్ నిలబడటం, కేసీఆర్‌ను ఓడించే సత్తా తనకుందని చెప్పడం కూడా సంచలనంగా చెప్పాల్సి ఉంది. సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిలబడటంతో మొత్తంగా పోటీ రసవత్తరంగా మారిపోయింది. ఇక్కడ్నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి సైతం బలమైన అభ్యర్థి కావడంతో నియోజకవర్గంలో గట్టి పోటీ తప్పేలా లేదు. ఇప్పటి వరకు డైరెక్ట్ ఫైట్ కాస్తా ముగ్గురు నేతల మధ్య ముక్కోణపు పోటీకి కారణమవుతోంది.

కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్ బూత్‌లు 266 ఉండగా, పురుష ఓటర్లు 1,18,718, స్త్రీ ఓటర్లు 1,27,080 ట్రాన్స్‌జెండర్లు 24 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,45,822 ఉన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తోండటంతో అందరి చూపు ఇక్కడే పడుతోంది. గజ్వేల్ లో సీఎం తేలిగ్గా గెలుస్తారని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నప్పటికీ ఆయన కామారెడ్డిలో పోటీ చేస్తోండటంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారుతోంది. మూడు పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డిపోరాడటంతో ఇక్కడ ఎవరు గెలుస్తారా అన్న చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ముదిరాజ్‌లు గెలుపు, ఓటములపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. కామారెడ్డిలో ముదిరాజ్ ఓటర్లు సుమారుగా 15 శాతం వరకు ఉన్నారు. వారితోపాటు మున్నూరు కాపు వర్గం వరకు 13 శాతం, మాదిగలు 9 శాతం, రెడ్లు ఎనిమిదన్నర శాతం వరకు ఉన్నారు. మాలలు సుమారుగా 8 శాతం వరకు ఉండగా, గౌడలు కూడా అంతే మేర ఉన్నారు. పద్మశాలీలు ఆరున్నర శాతం ఓటర్లున్నారు. ముస్లింలు 5 శాతానికి పైగా ఉన్నారు. గొల్లలు 4 శాతానికి పైగా ఉండగా, వైశ్యులు సైతం ఇక్కడ 4 శాతం మేర ఉన్నారు. ఇతరులు సుమారుగా 18 నుంచి 20 శాతం మేర ఈ నియోజకవర్గంలో ఉన్నారు.


 
							 
							