కేసీఆర్.. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా..
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు తెర లేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసులో కేసీఆర్తో పాటు ఎమ్మెల్యేలంతా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పాదాల వద్ద తాను చేసిన ప్రమాణంతో సీఎం కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆడియో టేపుల పేరుతో అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ యాడ్ చేశారని ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే కేసీఆర్ కొత్త ఎత్తుగడలతో రచ్చ చేస్తున్నారని విమర్శించారు.

నేను దేవుడిని నమ్ముకున్నా.. కేసీఆర్ దయ్యాలను నమ్ముకున్నాడు..
ఆడియో టేపుల్లో పేర్కొన్న నెంబరు 1 అంటే కేసీఆర్.. నెంబర్ 2 అంటే కేటీఆర్ అని.. సంతోష్ అంటే కేసీఆర్ తోడల్లుడి కుమారుడు సంతోష్ కుమార్ అని బండి సంజయ్ వివరించారు. లిక్కర్ కేసు నుంచి తన కుమార్తెను, అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే కేసీఆర్ ఇలాంటి గిమ్మిక్కులు చేస్తున్నారని.. మునుగోడులో పప్పులు ఉడకలేదని.. అందుకే దుకాణాన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేశాడని.. అక్కడా దుకాణం నడవక పోవడంతో ఢిల్లీలో కొత్త డ్రామాకు ప్లాన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను దేవుడిని నమ్ముకుంటే.. కేసీఆర్ దయ్యాలను, అవినీతి సొమ్ముతో కుట్రలను నమ్మకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.