మేడ్చల్‌లో గెలుపు నల్లేరుపై నడకేనా?
కొందరు వ్యక్తుల కారణంగా నియోజకవర్గాలు ఫేమస్ అవుతుంటాయ్. సంచలనం అవుతుంటాయ్. మేడ్చల్ నియోజకవర్గం కూడా అంతే. నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం అత్యంత ప్రముఖమైన నియోజకవర్గాల్లో ఒకటి. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మేడ్చల్, షామిర్ పేట్, ఘట్కేసర్, కీసర, మేడిపల్లి, కాప్రా, మూడుచింతల్ పల్లి మండలాలున్నాయ్. మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డి తొలిసారి 2019లో పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో ఒకటిగా మేడ్చల్ నిలుస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినవారితోపాటుగా, ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి సెటిలైన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి వజ్రేష్ యాదవ్, బీజేపీ నుంచి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు.

మేడ్చల్ నియోజకవర్గంలో 480 పోలింగ్ బూత్‌లు ఉండగా మొత్తం ఓటర్లు 5,95,382 మంది ఉన్నారు. వారిలో పురుషులు 3,06,854 కాగా, మహిళలు 2,88, 486 మంది ఉన్నారు. ఇక ట్రాన్స్‌జెండర్లు 42 మంది ఉన్నారు. మేడ్చల్ నుంచి మరోసారి విజయంపై మంత్రి మల్లారెడ్డి దీమాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సైతం ఇక్కడ్నుంచి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ సైతం బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి దింపింది. మేడ్చల్ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే ఇక్కడ గౌడ్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. సుమారుగా 16 నుంచి 20 శాతం వరకు వారి జనాభా ఉంది. ఇక రెడ్డి సామాజికవర్గం ఓటర్లు సైతం సుమారు 15 శాతం వరకు ఉన్నారు. ముదిరాజ్‌లు 11 శాతం, మాదిగలు 11 శాతం ఉండగా, యాదవులు 10 శాతం, ముస్లింలు 6 శాతం, మున్నూరు కాపులు 5 శాతం, ఎస్టీలు మూడు శాతం ఉండగా, ఇతరులు 20 శాతం వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గౌడ్, రెడ్డి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారికే విజయావకాశాలు ఎక్కువ.