సీఎం మార్పు అనివార్యమేనా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం తారా స్థాయికి చేరింది.కాంగ్రెస్ పార్టీ వర్గపోరు తో సీఎం రేవంత్ రెడ్డికి నిద్రలేకుండా పోతుంది.కొత్త, పాత, సీనియర్లు, జూనియర్లు అనే భేదాలతో పార్టీ నిర్వీర్యమైపోతుందని, అధికారంలోకి వచ్చాక పరిస్థితి మరింత అద్వానంగా మారిందని క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు .పటాన్‌చెరులో హస్తం పార్టీ మూడు ముక్కలుగా విడిపోయింది. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం, నీలం మధు వర్గం, గూడెం మహిపాల్ రెడ్డి వర్గాలుగా విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో పతనావస్థకు చేరుకుంది .గజ్వేల్, సిద్దిపేటలో పుట్టగొడుగుల లాగా రోజుకో వర్గం పుట్టుకొస్తుంది.ఈ మధ్య రేవంత్ రెడ్డి గజ్వేల్ పర్యటనలో రెండు వర్గాలు రేవంత్ రెడ్డి ముందే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంగతి తెలిసిందే. దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఇద్దరు సొంత లాభాల కోసమే ఎక్కువ పని చేస్తున్నారని, పార్టీ కోసం పని చేయడం లేదని పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు.రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఎటు చూసినా ఇదే పరిస్థితి నెలకొనడంతో కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైంది.మరో వైపు రెండు నెలల్లో సీఎం మార్పంటూ బీజెపి నాయకులు బాహాటంగా మాట్లాడుతుండటంతో గ్రూపు రాజకీయాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది.