Breaking Newshome page sliderHome Page SliderTelangana

‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ ఇదే మన నినాదం

తెలంగాణ రాష్ట్రం లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదగాలని సంకల్పంతో ముందుకు సాగుతోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు . 2030 నాటికి రూ.లక్ష కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించి, 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే దీర్ఘకాలిక ప్రణాళికను ఆయన ప్రకటించారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ సంస్థ ‘ఆస్‌బయోటెక్’ మరియు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తున్న ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన గురువారం పాల్గొన్నారు . గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్ లక్ష్యాలు, పెట్టుబడుల అవకాశాలను వివరించిన ఆయన, రాష్ట్రాన్ని “గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్”గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం లైఫ్ సైన్సెస్ రంగం విలువ 80 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో త్వరలోనే సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

ప్రపంచ లైఫ్ సైన్సెస్ అట్లాస్‌–2025లో హైదరాబాద్‌కి స్థానం దక్కడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన చెప్పారు. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో వంటి నగరాల సరసన హైదరాబాద్‌ నిలవడం ప్రత్యేకమన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కాకుండా “ఇన్వెంట్ ఇన్ తెలంగాణ” అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, బీహబ్, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ఆధునిక వేదికలతో పాటు, సింగిల్ విండో అనుమతి వ్యవస్థ, స్థిరమైన ప్రభుత్వం, ప్రోత్సాహక పారిశ్రామిక విధానాలు తెలంగాణను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా నిలిపాయన్నారు. సెల్ అండ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు, డిజిటల్ హెల్త్, మెడ్‌టెక్, అగ్రిబయోటెక్, గ్రీన్ బయో మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో పెట్టుబడుల అవకాశాలు విస్తారంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా కంపెనీలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. “విక్టోరియా–తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్” ఏర్పాటుకు ఈ సదస్సు నాంది పలుకుతుందన్నారు.