అమెరికా అధ్యక్షకార్యవర్గంలో ఇండో-అమెరికన్ల జోరు
ఇండియన్లకి అమెరికా అధ్యక్ష కార్యవర్గంలో కొత్త రికార్డు లభించింది. దాదాపు 130 మందికి పైగా భారతీయులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అక్కడ కేవలం ఒకశాతం మాత్రమే ఉన్న ఇండో-అమెరికన్లకు ఈస్థాయిలో బైడెన్ అధ్యక్షవర్గంలో ప్రాతినిధ్యం లభించడం చాలా విశేషం అనే చెప్పాలి. గతంలో ట్రంప్ కార్యవర్గంలో 80 మందికి స్థానం లభించింది. అంతకు ముందు ఒబామా కార్యవర్గంలో ఎనిమిదేళ్లకాలంలో 60 మందికి కొలువు లభించింది. అమెరికాలో తొలిసారిగా రోనాల్డ్ రీగన్ భారతీయులను తన కార్యవర్గంలో తీసుకోవడం మొదలుపెట్టారు.

బైడెన్ ప్రసంగాల రచయిత వివేక్ రెడ్డి, కొవిడ్-19 ప్రత్యేకసలహాదారుగా డాక్టర్ ఆశీష్ ఝూ, క్లైమెట్ పాలసీ సలహాదారు సోనియా అగర్వాల్, క్రిమినల్ జస్టిస్‌పై ప్రత్యేక సలహాదారు ఇలా చాలామంది కీలకస్థానాలలో ఉన్నారు. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ సంధు నిర్వహించిన కార్యక్రమానికి ఈ భారతీయులందరూ హాజరయ్యారు. వీళ్లేకాక దాదాపు 20 మంది భారతీయులు అమెరికాలోని టాప్ కంపెనీలలో కీలక పోస్టుల్లో ఉన్నారు. ఇక పలు రాష్ట్రాల్లో చట్టసభల్లో దాదాపు 40 మంది ఇండో-అమెరికన్ భారతీయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు కూడా ఉన్నారు.