భారత మహిళకు ప్రతీక తన తల్లి-మోదీ భావోద్వేక ట్వీట్
ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదే శత వసంతాల సంపూర్ణజీవితం గడిపిన ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. స్వయంగా ప్రధాని మోదీ తన తల్లి పాడె మోసారు. ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే. ప్రధాని మోదీ తన తల్లి జ్ఞాపకాలను తలుచుకుంటూ తన బ్లాగ్‌లో విలువలతో కూడిన తన తల్లి ఆదర్శజీవితాన్ని వివరించారు. ఒక భారతీయ మాతృమూర్తికి ఉండే సహజ లక్షణాలైన జాలి, కరుణ, సేవాతత్వం తన తల్లి జీవితంలో చూసానన్నారు.

తన తల్లి జీవితంలో ఎన్నో కష్టాలు పడిందని, చిన్న పెంకుటింట్లో తన చిన్నతనంలో వాద్‌నగర్‌లో ఉండేవారమని, పిల్లలను పోషించడానికి ఆమె చాలా కష్టాలు పడ్డారని తెలియజేశారు. వర్షాకాలంలో ఇంట్లోకి వర్షపు నీరు చేరి, చాలా ఇబ్బందులు పడేవారన్నారు. కుటుంబ ఖర్చుల కోసం ఇతరుల ఇళ్లలో కూడా ఆమె పనులు చేసేవారని, చరఖా తిప్పేవారని, క్షణం తీరిక లేకుండా ఇంటి పనులు, ఇతర పనులతో సతమతమయ్యేవారని తెలిపారు. ఎంతో శుచి, శుభ్రత కలిగి ఉండేవారని, ఇంటికి వచ్చిన పారిశుధ్య కార్మికులను ఎంతో ఆదరించేవారని గుర్తు చేసుకున్నారు మోదీ. తన తండ్రి స్నేహితుడు చనిపోతే వారి కుమారుడిని కూడా తమతో సమానంగా ప్రేమతో పెంచారని, తన పిల్లలతో సమానంగా ఆదరించారని తెలియజేశారు.

తాను 2001లో మొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేముందు అమ్మ ఆశీస్సులు తీసుకోబోతే, ఎప్పుడూ లంచం తీసుకోవద్దని, నిజాయితీగా ప్రజాసేవ చేయమని బోధించారని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో తాను సాధించిన విజయాలు ఆమె నేర్పిన విలువల కారణంగానే వచ్చాయని తెలియజేశారు. తన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఆమె పెట్టిన భిక్షేనన్నారు. తన తల్లి జీవితం సగటు భారతీయ మహిళకు ప్రతీక అనీ, భారతీయ మహిళలు కష్టపడే తత్వం కలవారని, ధైర్యంగా ముందడుగు వేసి విజయాలు సాధిస్తారని, వారికి అసాధ్యమైనది ఏదీ లేదని ప్రధాని బ్లాగ్‌లో వివరించారు.

