ఐసీసీ సీఈఓ గా భారత మీడియా మొఘల్
దుబాయ్: భారత మీడియా మొఘల్ సంజోగ్ గుప్తా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమితుల య్యారు. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అలర్స్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉండటంతో సంజోగ్ గుప్తాతో భర్తీ చేశారు. జియోస్టార్ నెట్వర్క్ కు సీఈఓగా వ్యవహరించిన సంజోగ్ గుప్తా మీడియా రంగంలో విశేషానుభవం ఉంది. దీంతో పాటు భారత్ కే చెందిన జై షా ఐసీసీ చైర్మన్ గా ఉండటం కూడా అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలు చక్కబెట్టే పదవిని చేపట్టేందుకు కలిసొచ్చింది. అంతమాత్రాన పూర్తిగా జై షా చలవే అనలేం. ఎందుకంటే ఏళ్ల తరబడి మీడియా రంగంలో ఆయన విశేష కృషి చేశారు. అందువల్లేనేమో 2500 పైచిలుకు దరఖాస్తు చేసుకుంటే సంజోగ్ ను సీఈఓ పదవి వరించింది. ఐసీసీలోని శాశ్వత, అనుబంధ సభ్యులైన 25 దేశాల నుంచి వేల సంఖ్యలో ఈ పదవి కోసం పోటీపడ్డారు. అనుభవం, పనితీరు ఆధారంగా ఒక్కో దేశం నుంచి 12 మంది చొప్పున తుది జాబితాకు ఖరారు చేయగా ఇందులో సంజోగ్ గుప్తా అర్హుడని ఐసీసీ కమిటీ భావించింది. ఈ నామినేషన్ల కమిటీలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్, లంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్లా, భారత బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సు మేరకే ఐసీసీ చైర్మన్ జై షా… సంజోగ్ ను కొత్త సీఈఓగా నియమించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా వచ్చి ఈ జనవరిలో పదవి నుంచి వైదొలిగిన అలర్స్ వారసుడిగా సంజోగ్ గుప్తా త్వరలోనే పదవీ బాధ్య తలు చేపడతారు. ఐసీసీ చైర్మన్ తర్వాత రెండో ప్రాధాన్య పదవి సీఈఓ. దీంతో ఈ రెండు కీలకమైన పదవుల్లో భారతీయులే కొలువుదీరడం విశేషం. జై షా భారత హోం మంత్రి అమిత్ షా తనయుడు. కానీ గుప్తా మాత్రం ఢిల్లీలోని ద ట్రైబ్యున్ పత్రికలో ఓ సాధారణ స్పోర్ట్స్ జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించి మీడియా మొఘల్ గా ఎదిగాడు. 2010లో స్టార్ ఇండియా (ప్రస్తుత జియో స్టార్)లో సహాయ ఉపాధ్యక్షుడిగా చేరిన సంజోగ్ తన నేర్పు, నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగారు. కంటెంట్, ప్రొగ్రామింగ్, వ్యూహారచనతో ఓ చానెల్ నెట్వర్క్ ను విస్తరించారు. అలా ఐసీసీ సీఈఓగా నియమితుడైన ఏడో వ్యక్తిగా సంజోగ్ గుప్తా పేరు గడించాడు. గతంలో డేవిడ్ రిచర్డ్స్ (1993-2001), మాల్కం స్పీడ్ (2001-2008), హరూన్ లోర్గాట్ (2008-2012), డేవిడ్ రిచర్డ్సన్ (2012-2019), మనూ సాహ్ని (2019-2021), జెఫ్ అలర్స్ (2021-2025) ఈ బాధ్యతలు నిర్వర్తించారు.