బ్రిటన్‌లో భారత్ ఆటోలు హల్‌చల్
లండన్: మనసర్కార్
మన సామాన్యుడి వాహనం ఆటోకు లండన్‌లో పెద్ద గౌరవం దక్కింది. ప్రపంచంలో పోలీస్ శాఖకు మంచి హైస్పీడ్ వాహనాలు ఇస్తుంటే బ్రిటన్ పోలీస్ శాఖ మన భారత్ ఆటోలపై మనసు పడింది. భారత్ ఆటో దిగ్గజం మహేంద్రా ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలను అక్కడి గ్వెంట్ పోలీసులు తమ వాహన జాబితాలో చేర్చుకున్నారు. పార్కులు, నడక మార్గాలు, బహిరంగ ప్రదేశాలు, ఇరుకు మార్గాలలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. సామాన్యపౌరులు తమ ఫిర్యాదులను ఈ ఆటోల వద్ద నమోదు చేయవచ్చు. సేఫ్ స్ట్రీట్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఆటోలను ప్రవేశపెడుతున్నారు. ఈ ఆటోల వద్ద పోలీస్ సంబంధిత సేవలన్నీ లభిస్తాయి. నేరాలను నియంత్రించడానికి, అసాంఘిక శక్తులను కట్టడి చేయడానికి, వీధుల్లో మహిళలకు భద్రత కలిగించడానికి ఈ ఆటోలు తోర్పడగలవని ఆశిస్తున్నారు. గ్వెంట్ పోలీస్ చీఫ్ డామియన్ సౌరే ఇటీవల ఓ ఈవెంట్‌లో ఈ ఆటోలను ప్రదర్శించారు. గస్తీ విషయంలో కూడా స్థానికులు ఈ ఆటోల విషయంలో సానుకూలంగా ఉన్నారని వివరించారు.

ఈ విషయంపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా చాలా సంతోషించారు. ఈ గొప్ప కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ భాగమైనందుకు గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ లోగో చాలా సుపరిచితంగా కనిపిస్తోందని క్యాప్షన్ ఇచ్చారు. మహీంద్రా ఎలక్ట్రిక్ సంస్థ కూడా ట్వీట్ చేసింది. మన ఆటోలను ఇలా ఉపయోగించుకోవచ్చనే ఆలోచన చాలా బాగుంది కదూ. మనదేశంలో కూడా పోలీసులు ఇలాంటి ఆటోలను ఇరుకుసందుల్లోనూ, చిన్న గ్రామాలలోనూ ఉపయోగిస్తే చాలా మందికి పోలీసులు అందుబాటులో ఉన్నట్లవుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడేవారికి, షీ టీమ్స్‌కు, గస్తీకి కూడా ఈ ఆటో మొబైల్ పోలీస్ స్టేషన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

