యూపీఐ చెల్లింపులపై ఛార్జీల పెంపు
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే పెద్ద మొత్తాల లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 3,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఈ ఛార్జీలను విధించే అవకాశం ఉందని విశ్వసనీయమైన సమాచారం. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక సేవల విభాగం ఉన్నతాధికారుల మధ్య చర్చల దశలో ఉంది. యూపీఐ లావాదేవీల పరిమాణం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు, చెల్లింపు సేవల ప్రొవైడర్లు తమ లావాదేవీల నిర్వహణ ఖర్చులను తిరిగి పొందేందుకు వీలు కల్పించడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. చిన్న మొత్తాల చెల్లింపులపై వ్యాపారుల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకపోవచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఐదేళ్ల క్రితం యూపీఐ, రూపే లావాదేవీలపై అన్ని రకాల ఎండీఆర్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే యూపీఐ ద్వారా రికార్డు స్థాయిలో రూ. 24.77 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు ప్రాసెస్ అయ్యాయి.


 
							 
							