ఇమ్రాన్ కు సర్జరీ…చూపు కోల్పోయే ప్రమాదం ?
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి కలకలంగా మారింది. అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందంటూ వెలువడుతున్న వార్తలు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. కుడి కంటిలోని రక్తనాళాల్లో పూడిక ఏర్పడటంతో ఆయన ‘సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్’ అనే తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వెల్లడించింది. తక్షణమే నిపుణుల చికిత్స అందకపోతే శాశ్వత అంధత్వం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది.
మీడియా కథనాల ప్రకారం , ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిలో రెటీనా భాగానికి వెళ్లే రక్తప్రసరణ తీవ్రంగా తగ్గింది. దీని వల్ల చూపు మసకబారడం, శాశ్వత నష్టం జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యవసరంగా శస్త్రచికిత్స లేదా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, జైలు అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పీటీఐ ఆరోపిస్తోంది.
ఇమ్రాన్ ఖాన్‌కు జైలు లోపలే చికిత్స అందిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, అటువంటి క్లిష్టమైన ఆపరేషన్‌కు అవసరమైన వసతులు జైలులో లేవని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆయనను వెంటనే లాహోర్‌లోని శౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి లేదా ఆయన కోరుకునే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 అక్టోబర్ తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన వ్యక్తిగత వైద్యుడు కూడా కలవడానికి అనుమతించలేదని పీటీఐ ఆరోపించింది. ఇస్లామాబాద్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, జైలు అధికారులు వాటిని బేఖాతరు చేస్తున్నారని పేర్కొంది. ఇది ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శించింది.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నొరీన్ ఖానుమ్ అడియాలా జైలు వెలుపల ఆందోళన చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజమెంతనేది ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘అసలు ఆయనకు కంటి సమస్య ఉంటే మాకు ఎందుకు తెలియజేయలేదు? ఈ సమాచారం ఎవరు లీక్ చేస్తున్నారు?’’ అంటూ అలీమా ఖాన్ ప్రశ్నించారు. తమ ఏకైక డిమాండ్ ఇమ్రాన్ ఖాన్‌కు తక్షణమే వైద్య సహాయం అందించడమే కాకుండా, ఆయనను విడుదల చేయాలనేదేనని తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పీటీఐ నేతలు ఇస్లామాబాద్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఖైదీని కలవడం చట్టపరమైన హక్కు అని పీటీఐ ఛైర్మన్ బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ స్పష్టం చేశారు. మే 9 నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు, తోషాఖానా కేసులో బుష్రా బీబీకి మధ్యంతర బెయిల్‌ను కోర్టు ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది.

