చేతకాకపోతే వెళ్లిపోండి.. అధికారులకు సీఎం వార్నింగ్..
అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పని చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సరిగ్గా పనిచేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇవాళే జక్కంపూడి ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఐదేళ్లుగా అధికార వ్యవస్థ ఏ మాత్రం సరిగ్గా పని చేయలేదని విమర్శించారు. విజయవాడలో వరద బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందన్నారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని.. ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి సాయం అందాలని ఆదేశించారు. వాహనాలను ఒక చోట నిలిపి ఆహార పంపిణీ చేయవద్దని.. ఆయా ప్రాంతాలకు వేర్వేరు వాహనాలను కేటాయించామని, అక్కడికి వెళ్ళి వాటిని పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సహాయం కోసం ఏ మెసేజ్ వచ్చినా వెంటనే స్పందించి.. తగు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు మానవత్వంతో పనిచేయాలని.. చెత్త రాజకీయాలను వదిలి పెట్టాలన్నారు. 37 మంది ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని తెలిపారు. ఆరు హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రతి సచివాలయానికి ఒక అధికారిని నియమించామని సీఎం పేర్కొన్నారు.

