సొంతూళ్లకి వెళ్తున్నారా అయితే మీ ఇళ్లు జాగ్రత్త
సంక్రాంతి అంటేనే సంబరం…సంరంభం …సౌరభం…సోయగం…సంతోషం..వెరసి పరవళ్ళు తొక్కే సంసృతీ సంప్రదాయాల సమ్మిళిత సాగరం.అందుకే ఉద్యోగస్తులు,వ్యాపారస్థులు,విద్యార్ధులు,యువత ఈ పండుగ సెలవు దినాల వేయి కళ్ళతో నిరీక్షిస్తుంటారు.ఇలాంటి సంతోషంలో చిన్నపాటి జాగ్రత్తలను కొద్దిపాటి నిర్లక్ష్యంతో మర్చిపోతుంటాం.భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచేవాళ్లు మధ్యతరగతి కుటుంబీకులు.రూపాయి రూపాయి పోగు చేసి లక్షలు కూడబెట్టి కోటీశ్వరులవ్వాలనే కలలను సాకారం చేసుకునేందుకు నదిలో చేపలా జీవితంలో వారి వారి లక్ష్యాలను సాధించే వరకు ఎదురీదుతూనే ఉంటారు.ఇలాంటి వారంతా సంక్రాంతి లాంటి అతి పెద్ద పండగలకు ఇళ్ల ను వదిలి సొంతూళ్లకు వెళ్ళేటప్పుడు ఇంటి భద్రతను గాలికొదిలేసి వెళ్తుంటారు.ఇదే అదనుగా భావించి…చోరీలకు పాల్పడి ఇళ్లకు ఇళ్లను ఊడ్చే నేరగాళ్ల ముఠాలు ఈ సంక్రాంతి సమయంలోనే తయారవుతుంటాయి. గత సంక్రాంతి సమయంలో ఒక్క ఏపిలోనే 8000 ఇళ్ల దొంగతనాల కేసులు నమోదు కాగా…తెలంగాణలో కేవలం 6వేల కేసులు నమోదైతే ఒక్క జంట నగరాల పరిధిలోనే 3200 కేసులు నమోదయ్యాయి. కాబట్టి సంక్రాంతికి సొంతూళ్లకి ఇళ్ళే వారు లేదా డే టూ ఫంక్షన్లకు వెళ్లేవారు తమ తమ ఇళ్లను భద్రంగా ఉంచుకుని బయలుదేరాలని పోలీసులు సూచిస్తున్నారు.లేదా పోలీసులకు సమాచారం ఇస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు.

