NewsTelangana

మునుగోడులో తేడా వచ్చిందో.. మీ పనీ.. నా పనీ ఔట్‌

మీ పే స్కేల్‌ ఫైల్‌ తయారైంది.. నా వద్ద ఉంది

మీరు టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తేనే ఫైల్‌ ముందుకు

లేకుంటే నా పని అయితది.. మీ ఫైల్‌ వెనక్కి వెళ్తుంది

సెర్ప్‌ ఉద్యోగులకు మంత్రి ఎర్రబెల్లి బెదిరింపులు

మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సావధాన దండోపాయాలు ప్రదర్శిస్తోంది. నయానా భయానా ఓట్లు వేయించుకోవడమే ఏకైక లక్ష్యంగా టీఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. బుజ్జగింపులతో ఓటర్లను తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు.. ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా సెర్ప్‌ ఉద్యోగులతో సమావేశమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ‘మునుగోడులో తేడా వచ్చిందో.. మీ పనీ.. నా పనీ ఔట్‌.. మీరు ఈ ఎన్నికల్లో బాగా పనిచేశారని రిపోర్టు వస్తేనే మీ పే స్కేల్‌ ఫైల్‌ ముందుకు కదులుతుంది’ అని బెదిరించారు.

టీఆర్‌ఎస్‌ విజయం కోసం సెర్ప్‌ ఉద్యోగులు పని చేయాలి: ఎర్రబెల్లి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ సెర్ప్‌ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సభకు మునుగోడులో విధులు నిర్వహిస్తున్న సెర్ప్‌ ఉద్యోగులను తీసుకొచ్చారు. ఆత్మీయ సభ పేరుతో సెర్ప్‌ ఉద్యోగులను ఈ సభలోనే మంత్రి ఎర్రబెల్లి బెదిరించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం కోసం సెర్ప్‌ ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. మీరు బాగా పని చేస్తున్నట్లు రిపోర్టు వస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుందన్నారు. సెర్ప్‌ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కానందున ఎన్నికల్లో బహిరంగంగానే పనిచేయొచ్చని సూచించారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యత మీదే అని స్పష్టం చేశారు.

మిమ్మల్ని కేసీఆరే కాపాడతారు..

‘ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. అంటే అర్ధమైందా. మీ పే స్కేల్‌ ఫైల్‌ ఆల్రెడీ తయారైంది. మునుగోడులో కష్టపడి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే నేను సంతకం పెడతా. ఎవరైనా సరిగ్గా పనిచేయకపోతే.. తేడా వస్తే.. నా పని అయితది. మీ ఫైల్‌ ముందుకు కదలదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతటా ప్రచారం చేస్తున్నారు. మీరు బాగా పని చేస్తున్నారన్న రిపోర్టు రావాలి. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కేసీఆరే కాపాడతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి ఎన్నికల కోడ్‌ ఉన్నా బహిరంగంగా పని చేయొచ్చు’ అని సెర్ప్‌ ఉద్యోగులకు ఎర్రబెల్లి హెచ్చరికతో కూడిన సూచన చేశారు.