నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం..
రైతు బంధుకు కోతలు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. రైతు బంధు యథాతథంగా ఇస్తామంటే.. ఈ చర్చ ఎందుకు? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు పది రోజులు పొడిగించాలి. ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథపై చర్చ చేపట్టాలి. నల్గొండ జిల్లా అభివృద్ధిపై కూడా ఒక రోజు చర్చ చేపట్టాలి. గతంలో జరిగిన తప్పులు ఎత్తి చూపితే మీకు ఇబ్బందిగా ఉంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టడం సబబా? బీఆర్ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లు డిప్యూటీ సీఎంయే చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 24 గంటలు ఇస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. సభ వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దాం. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చూపెడితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుంది. రైతు బంధు మీద కాంగ్రెస్ విపరీతమైన దుష్ప్రచారం చేసింది. రైతు బతుకును మార్చిన గేమ్ ఛేంజర్ రైతు బంధు” అని కేటీఆర్ అన్నారు.