Home Page SliderInternational

‘మా ఖైదీలను విడుదల చేయకపోతే బందీలు ప్రాణాలతో ఉండరు’..హమాస్

ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్యపోరు తారాస్థాయికి చేరుతోంది. మా ఖైదీల విడుదల, చర్చలు లేకుంటే, ఇజ్రాయెల్‌కు చెందిన బందీలను ప్రాణాలతో చూడలేరంటూ హమాస్ తీవ్రంగా బెదిరిస్తోంది. దాదాపు 7 వేల మంది పాలస్తానీయులు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారని సమాచారం. వారిని విడిచి పెడితేనే తమ వద్ద గాజాలో బందీలుగా ఉన్న 137 మంది ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెడతామని, లేకపోతే వారిని ప్రాణాలతో తమ దేశానికి పంపేది లేదని స్పష్టం చేసింది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రదాడి అనంతరం గాజాపై ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఉత్తర, దక్షిణ గాజాలలో పోరాటం ఉద్ధృతమయ్యింది.

మరోపక్క గాజాపై కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాలు పట్టుపడుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంతో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఈ దాడులలలో అల్‌షిపా ఆసుపత్రి తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఆసుపత్రిలోనే దాదాపు 30 వేల మంది ఆశ్రయం పొందుతున్నట్లు మీడియా పేర్కొంది. అక్కడి వారికి ఆహారం, నీరు, మందులు అందడం లేదని, వారి జీవితాలు నరకప్రాయంగా ఉన్నాయని, వారిలో అధికశాతం చిన్నారులేనని పత్రికలలో వెల్లడించారు. హమాస్ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ యుద్ధాల వల్ల 18 వేల మంది పాలస్తానీయులు మరణించారని సమాచారం.