బీఆర్ఎస్ లో ఉంటె కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చేవారు
- సీఎం పై హాట్ కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి
- సీమాంధ్ర కాంట్రాక్టర్లకు ప్రభుత్వ సొమ్ము దోచి పెడుతున్నారని ఘాటు వాఖ్య
- రేవంత్ రెడ్డి పదవి ఇక మూడున్నరేళ్లే అని వివాదాస్పద వాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ‘‘సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలి. ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా, ప్రభుత్వం ప్రజల కోసం ఏమి చేస్తోందో వివరించాలి,’’ అని అన్నారు. ప్రాజెక్టుల పేరిట సీమాంధ్రకు చెందిన 20 మంది కాంట్రాక్టర్లకు ప్రభుత్వ సంపదను అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరేటప్పుడు కేంద్ర హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇంకా మూడున్నరేళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎవరు సీఎం అవుతారో అప్పుడే తేలుతుంది,’’ అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘‘ఓడ దాటే వరకు ఓ మల్లన్న, ఓడ దాటాక బోడ మల్లన్న’’ అన్నట్లుగా ముఖ్యమంత్రిని విమర్శించారు.‘‘తనకు మంత్రి పదవిని హైకమాండ్ హామీ ఇచ్చింది. నా అన్న వెంకట్ రెడ్డికి దీనితో ఎలాంటి సంబంధం లేదు,’’ అని స్పష్టం చేశారు. ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదన్న అంశంపై స్పందిస్తూ, ఆయన పదవికి రాజీనామా చేయడం మంచిదని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేకపోవడం వల్ల విసిగిపోయిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అంశంపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ‘‘ఒకవేళ నేను బీఆర్ఎస్‌లో ఉన్నా, కేసీఆర్ ఇప్పటికే నాకు మంత్రి పదవిని ఇచ్చేవారు,’’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.