కవిత జోలికొస్తే జరిగేది ఇదే..!
సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జోలికొస్తే జరిగేది ఇదేనని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏ జీవన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో కవితకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినా బీజేపీ ఉన్మాదులు కవిత ఇంటిపై రౌడీయిజం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితమ్మను పోరాటాల వనితగా, తెలంగాణ బతుకమ్మగా అభివర్ణించారు. అలాంటి ధీర వనితపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా నిరాధార నిందలు వేశారని ఆగ్రహం చెందారు. నిజానికి మంజిందర్ సిర్సాపైనే రూ.50 లక్షల చీటింగ్ కేసు ఉందని, ఆయనకు లుకౌట్ నోటీసు కూడా జారీ అయిందని చెప్పారు. దాడులు చేసిన బీజేపీ వాళ్లే మళ్లీ ధర్మ దీక్ష అంటూ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాది 60 లక్షల సైన్యం
`టీఆర్‌ఎస్ పార్టీ అంతా కవితక్కకు అండగా ఉంది. 60 లక్షల మంది మా టీఆర్‌ఎస్ సైన్యం తిరగబడితే బీజేపీ బట్ట కడుతుందా? బీజేపీ దాడుల సంస్కృతిని వీడకుంటే తాము కూడా కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇళ్లపై దాడులు చేస్తాం. ఖబడ్దార్` అని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.

కేసీఆర్‌ను దేశ రాజకీయాల్లోకి రాకుండా చేసే కుట్ర
సీఎం కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు కుట్ర చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. కవితను టార్గెట్ చేస్తే కేసీఆర్ వెనక్కి తగ్గుతారనే పిచ్చి భ్రమలో వాళ్లు ఉన్నారన్నారు. తప్పు చేసినా.. చేయకున్నా `జై మోడీ` అన్న వారి జోలికి ఈడీ రాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ది పోరాడే కుటుంబమని, బీజేపీ రౌడీయిజానికి, మోదీ ఈడీయిజానికి, అమిత్ షా ఐటీయిజానికి తెలంగాణాలో స్థానం లేదన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐలు మోడీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని, అంబానీ, అదానీల చేతిలో మోడీ, అమిత్ షా తోలుబొమ్మలుగా మారారని వ్యాఖ్యానించారు.