సర్కార్ భూమి జోలికొస్తే వదిలేదే లేదు
హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా , తాజాగా మదీనాగూడలో భారీ కబ్జాను అడ్డుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామంలోని సర్వే నంబర్ 23లో గల సుమారు 1,000 గజాల పార్కు స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.13 కోట్లు ఉంటుంది
మదీనాగూడలోని ‘ఉషోదయ ఎన్‌క్లేవ్’ లేఅవుట్ నిర్మాణ సమయంలో నిబంధనల ప్రకారం 1,000 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఈ మేరకు సదరు స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించారు. అయితే, స్థానిక వ్యక్తి ఒకరు ఈ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి, చుట్టూ ప్రీకాస్ట్ ప్రహరీ గోడను నిర్మించి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దీనిపై కాలనీవాసులు ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.
రెవెన్యూ మరియు జీహెచ్‌ఎంసీ రికార్డులను పరిశీలించి అది పార్కు స్థలమేనని నిర్ధారించుకున్న అధికారులు, సోమవారం అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ‘ఈ స్థలం హైడ్రా స్వాధీనంలో ఉంది’ అని సూచించే బోర్డులను పాతారు. నిరంతరం కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

