అమరావతికి అడ్డు పడితే ముఖ్యమంత్రినైనా జైలుకు పంపాల్సిందే
హైకోర్టు తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తుందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, సంబంధిత ఇతర మంత్రులను జైలుకు పంపాల్సిందేనని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాలగౌడ అభిప్రాయపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై హైకోర్టు తీర్పు వెలువడి ఆరునెలలవుతున్నా దానిని అమలు చేయకపోవడం, మూడు రాజధానులే తమ విధానమంటూ కొందరు మంత్రులు ప్రకటనలు చేయడం ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కారమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణానికి నిధుల్లేవని ప్రభుత్వం తప్పించుకోవడానికి వీలులేదని, అమరావతిని విపక్షనేతగా ఉన్నప్పుడే జగన్ ఆమోదించారని అన్నారు. అమరావతి కేసుల్లో అన్ని అంశాలు కూలంకుషంగా పరిశీలించిన మీదటే హైకోర్టు తీర్పు చెప్పిందని, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ విధానాల్లో మార్పు చేయాలంటే విస్తృత ప్రజాప్రయోజనాలు వస్తాయనుకున్నప్పుడే చేయాలని, అసలు ఈ కేసులో ప్రజాప్రయోజనమనే ప్రశ్నే లేదని, పైగా రాష్ట్ర ప్రజలు పాదయాత్రల పేరుతో వ్యతిరేఖిస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను ఈ కేసును విచారిస్తున్నట్లయితే కచ్చితంగా ముఖ్యమంత్రిని జైలుకు పంపేవాడినన్నారు. హైకోర్టును కూడా ఇష్టానుసారం తరలించే విధానం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవడం అవసరం అన్నారు.

ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు రాజధానిని ఆట వస్తువులా భావించి, విభజించడానికి చట్టబద్దత లేదని హెచ్చరించారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో ఇష్టానుసారం మార్పులు చేసేందుకు వీలుగా రాజ్యాంగపరంగా వీలుకాదని పేర్కొన్నారు. రాజధాని రైతుల ఆత్మఘోష అర్థం చేసుకోవాలని, వారి 1000 రోజులకు పైబడిన మహా పాదయాత్రకు ఫలితం లభించాలని వారికి మద్దతు తెలియజేశారు.