HMPV ని ఇలా గుర్తించండి..
చైనాలో HMPV వ్యాప్తి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు. ఇది ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను కూడా కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల న్యుమోనియా, ఆస్థమా తీవ్రం అవుతాయని వివరిస్తున్నారు.

చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇన్‌ఫెక్షన్ సోకిన 3-6 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం. వైరస్ ఉన్నవారిని తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్ల తాకడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనికి కరోనాకు పాటించిన నియమ నిబంధనలే పాటించాల్సి వస్తుంది. వ్యక్తిగత దూరం పాటించడం, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం, మాస్క్ ధరించడం వంటి పద్దతులు పాటించాలి. ప్రస్తుతం హెచ్‌ఎంపీవీకి నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి టీకానూ ఇంకా అభివృద్ధి చేయలేదని వెల్లడిస్తున్నారు. ఇంకా వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సి ఉంటుందని అంటున్నారు.