Home Page SliderNews AlertTelanganatelangana,

‘ప్రభాస్ సినిమా చూస్తా’.. మిస్ వరల్డ్ ఓపల్ సుచాత

వందలమంది సుందరీమణులతో పోటీ పడి ప్రపంచసుందరి కిరీటాన్ని చేజిక్కించుకుంది థాయ్‌లాండ్ బ్యూటీ ఓపల్ సుచాత. అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినిమాల గురించి మాట్లాడుతూ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘బాహుబలి’ చిత్రాన్ని చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా 20 రోజుల పాటు తెలంగాణలో గడిపిన తనకి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ బాగా నచ్చిందని, అక్కడ బాహుబలి మూవీ సెట్ చూసి, ఆ చిత్రాన్ని చూడాలనుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు పోటీలు పూర్తయ్యాయి కనుక తప్పకుండా చూస్తానని, మూవీ రివ్యూ ఇస్తానని పేర్కొన్నారు. తనకు భారత్ నుండి మిస్ వరల్డ్‌గా ఎంపికైన మానుషి చిల్లర్, ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టమని, వారి నుండి స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రం బాగా నచ్చిందని, ప్రేక్షకులను ఆలోచింప చేసిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ సుందరి కిరీటం తన దేశానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిందని, తమ దేశానికి ఇదే మొదటి విజయమని పేర్కొన్నారు.