Home Page SliderNational

టికెట్ కోసం అడుక్కోను… బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ సవాడి

కర్నాటక బీజేపీలో ముసలం
టికెట్ దక్కకపోవడంతో సీనియర్ నేత రాజీనామా
టికెట్ కోసం యాచించేది లేదన్న లక్ష్మణ్
కాంగ్రెస్ సీనియర్లతో లక్ష్మణ్ మంతనాలు

వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తర్వాత కర్ణాటకలో బీజేపీ గందరగోళం కొనసాగుతోంది. పార్టీ టికెట్ లభించకపోవడంతో, సీనియర్ నేత లక్ష్మణ్ సవాడి ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పారు. “నేను నా నిర్ణయం తీసుకున్నాను. నేను భిక్షాటన గిన్నెతో తిరిగేవాడిని కాదు. నేను ఆత్మగౌరవం ఉన్న రాజకీయ నాయకుడిని. నేను ఎవరి ప్రభావంతో వ్యవహరించడం లేదు” అంటూ మీడియా ముందు వాపోయాడు లక్ష్మణ్ సవాడి. అయితే లక్ష్మణ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే లక్ష్మణ్ తమతో టచ్ లో లేడన్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.

లక్ష్మణ్ సవాది మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు విధేయుడుగా ఉన్నాడు. అత్యంత శక్తివంతమైన లింగాయత్ నాయకులలో ఒకరు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసిన కొద్దిమందిలో లక్ష్మణ్ కు గుర్తింపు పొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ కుమఠహళ్లిపై ఆయన ఓడిపోయారు. ఒక సంవత్సరం తర్వాత, కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్ ప్రభుత్వం తిరుగుబాటు సమయంలో లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారు. అయితే 2012లో అసెంబ్లీలో పోర్న్ చూస్తూ పట్టుబడటంతో పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకొంది. ఫిరాయింపుదారులైన మహేశ్ కుమఠహళ్లి, అథని నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

అభ్యర్థుల ఎంపికపై బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తొలి జాబితా నుంచి గల్లంతైన వారిలో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ నాయకత్వానికి విన్నవించేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే, నాయకత్వం తనను పట్టించుకోకపోవడంతో మొండిచేయితో తిరిగొచ్చాడు. షెట్టర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జాబితా ప్రకటించకముందే మరో సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనను తప్పించే సూచనలు అందాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల కోసం 189 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ నిన్న రాత్రి ప్రకటించింది. పలువురు ఎమ్మెల్యేలను తొలగించి, కాంగ్రెస్ నేతలకు పార్టీ టికెట్లు కేటాయించింది. కర్నాటక బీజేపీ జాబితాలో 52 మంది కొత్త అభ్యర్థులు బరిలో నిలిచారు. 224 అసెంబ్లీ స్థానాలకు తొలి అభ్యర్థులను ఖరారు చేయడానికి ముందు పార్టీ అనేక సమావేశాలను నిర్వహించింది. కళంకిత, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, సర్దుబాటు రాజకీయాలను పక్కనబెట్టాలని పార్టీ నేతలకు మోదీ తేల్చి చెప్పారు.