కేసీఆర్ ను ఓడించడానికే గజ్వేల్ వచ్చాను..ఈటల
నాకు నియోజకవర్గం లేక గజ్వేల్ కి రాలేదు. కేసీఆర్ ను ఓడించడానికే గజ్వేల్ వచ్చాను అని గజ్వేల్‌లో జరిగిన విజయ శంఖారావం సభలో ఈటల రాజేందర్ ముక్కుసూటిగా చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన తరువాత తొలిసారిగా గజ్వేల్ కు వచ్చారు ఈటల రాజేందర్. ఈ సందర్బంగా వర్గల్ సరస్వతీదేవి దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు చేసిన ఈటల.. వర్గల్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పది సంవత్సరాల పాటు వర్గల్లోనే ఇల్లు కట్టుకొని ఉన్నానని, ఇక్కడే పౌల్ట్రీ ఫామ్ నిర్వహించామని అన్నారు. 1992 లో నేను గజ్వేల్ నియోజకవర్గంలోని శాకాహారంలో మొదటి పౌల్ట్రీ పెట్టాను. శిలాసాగర్, రిమ్మనకూడ, కొక్కండలో పౌల్ట్రీలు ఉన్నాయి. అనేక సంవత్సరాలు ఈ ప్రాంతంతో సంబంధమున్నది. 20 ఏళ్ల పాటు మీ కళ్లముందు పెరిగిన బిడ్డను. సందర్భం వస్తే ఈ బిడ్డ ఎటువైపు ఉంటారో మీకు తెలుసు. అసెంబ్లీలో నేను కొట్లాడిన కొట్లాట మీ గుండెల్లో ఇంకా ఉంది అని అనుకుంటున్నా.

మంత్రి పదవి ముఖ్యమా.. మా పేదల బ్రతుకులు ముఖ్యమా అంటే.. మంత్రిగా ఉండి కూడా నేను కార్మికులకు మద్దతు తెలిపి వారి ఉద్యోగాలు పెట్టించిన బిడ్డను. హుజూరాబాద్లో 6 నెలల పాటు ఎన్నికలు కొట్లాడాను. భూమ్మీదనే నరకం చూసాను. నా నాయకులు అందరినీ కొనుగోలు చేశారు. ఏ ఊరికి మీటింగ్ కి పోయిన ఆ ఊర్లో జనాలు లేకుండా తీసుకుపోయి దావతులు ఇచ్చారు. కరెంటు కట్ చేశారు. ఈటల శిఖండితో యుద్ధం చెయ్యడు.. ధీరునిగా కొట్లడతాడు. నేను గరీబువొన్ని, బక్కపలచని వాన్ని.. కెసిఆర్ డబ్బులతో నేను కొట్లాడలేను..ధర్మంతో, న్యాయంతో మాత్రమే కొట్లాడగలను. గజ్వేల్ ప్రజల అండతోనే కొట్లాడగలను. నాకు నియోజకవర్గం లేక గజ్వేల్ కి రాలేదు. కేసిఆర్ ను ఓడించడానికి వచ్చాను. నువ్వు తాగిపించి సంపాదించే సంపాదన వల్ల.. తెగిపడిన పుస్తెలతాళ్ళు నీకు కనిపించడం లేదా. నీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి గజ్వేల్ లో 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అభివృద్ధి పేరిట భూములు లాక్కొని రైతులను అడ్డాకూలీలుగా మార్చారు. పీడవిరుడుగు కావాలంటే, ఈ బాధల నుండి విముక్తి కావాలంటే అది ఓటు హక్కు ద్వారానే సాధ్యం. నిండుమనసుతో నన్ను ఆశీర్వదించండి. అని ప్రజలను కోరారు.

అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ బీసీ ముఖ్యమంత్రి అనేదే మా బీజేపీ నినాదం. ఈటల రాజేందర్‌ను గెలిపించే చారిత్రాత్మక భాధ్యత గజ్వేల్ ప్రజల మీద ఉంది. హరీష్ బుల్లెట్ కాదు ఉత్త బుర్ర.. ఆ బుర్రకు గజ్వేల్ ప్రజలు బుద్ధిచెప్పాలి. గజ్వేల్ లో ఓడిపోతానని తెలిసి కెసిఆర్ కామారెడ్డి పారిపోయారు. గజ్వేల్ కి కెసిఆర్ కి పేగుబంధం తెగిపోయింది. బండెనక బండి కట్టి కెసిఆర్ ను సాగనంపాలి. అని ప్రజలకు పిలుపునిచ్చారు.
నేటి సభలో ఈటల రాజేందర్ అధ్వర్యంలో బీజేపీలో చేరికలు జరిగాయి. గడిపల్లి భాస్కర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన జస్వంత్ రెడ్డి, మాజీ AMC చైర్మన్ రాంరెడ్డి, పెద్దిరెడ్డి వెంకట్ రెడ్డి, సింగం సత్తయ్య, నర్సింహారెడ్డి, చెట్టి సురేష్, రామచంద్రం, ఆరే పెంటయ్య, అప్పాల మల్లేష్, సుభాష్ చంద్రబోస్, రాజిరెడ్డి, బిక్షపతి, హైదర్, అనూప్, సత్యనారయణ, పూల సత్యనారాయణతో పాటు పలువురు చేరారు.