హైడ్రా పేదల ఇళ్ళు కూల్చదు
హైదరాబాద్‌లోని చెరువులను రక్షించేందుకు ఏర్పాటైన హైడ్రా సంస్థకు ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవ వేడుకలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక కోణాన్ని దృష్టిలో పెట్టుకొని పేదల ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని, హైడ్రా కార్యక్రమం పేదలపై కాకుండా చెరువుల పరిరక్షణపై కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శనంలో సంస్థ పని చేస్తోందని, భవిష్యత్ తరాలకు జీవనాధారంగా నిలిచే చెరువులను భద్రపరిచే దిశగా చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. హైడ్రా సంస్థ వ్యవస్థాపన తర్వాత చెరువుల ఆక్రమణలపై కఠినంగా స్పందించడంతో అక్రమ నిర్మాణాలు తగ్గుముఖం పట్టాయని కమిషనర్ తెలిపారు. హైడ్రా అంటే కేవలం కూల్చివేత మాత్రమే కాదు, అభివృద్ధి కూడా అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 21వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను అధికారికంగా ప్రారంభించనున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రజల కంట పడుతోన్న బతుకమ్మ కుంట ఒక శాంపిల్ మాత్రమేనని, త్వరలో నగరంలో మరిన్ని చెరువులను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని రంగనాథ్ వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదు కలెక్టర్ హరిచందన, మాజీ ఎంపీ వి.హనుమంతు రావు తదితరులు పాల్గొన్నారు. హైడ్రా ప్రాజెక్టు ద్వారా నగర చెరువులకు జీవం పోసే ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టమైంది.