News AlertTelangana

కీచక సీఐ నాగేశ్వరరావు ఊస్టింగ్

మహిళను తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన కేసులో హైదరాబాద్ మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కె నాగేశ్వరరావును సస్పెండ్ చేసి, అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత షరతులతో కూడిన బెయిల్‌పై అతను విడుదలయ్యాడు. అయితే ఈయనను సర్వీసు నుండి తొలగిస్తూ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు ప్రతిష్ఠకు భంగం కలిగించాడని, ప్రజలలో పోలీసులపై నమ్మకం, భరోసాలకు మచ్చ తెచ్చారనే కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. ఈ ఏడాది జూలైలో వనస్థలిపురానికి చెందిన మహిళను బెదిరించి, అడ్డుపడిన ఆమె భర్తను కిడ్నాప్ చేసి, కారులో ఫామ్‌హౌస్‌కు తీసుకెళుతుండగా కారుకు ప్రమాదం జరగడంతో తప్పించుకున్న బాధితురాలు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో తగిన ఆధారాలు లభించడంతో అరెస్టు చేశారు. ఈ సంఘటనను తెలంగాణా పోలీసులు తీవ్రంగా పరిగణించారు. పోలీసుల ప్రతిష్ఠకే మచ్చతెచ్చారని ఆయన్ను సర్వీస్ రిమూవల్ కోరుతూ నగర సీపీ సీవీ ఆనంద్ రిక్రూట్‌మెంట్ అథారిటీకి లేఖ రాశారు. సాక్షులను బెదిరించడం, విచారణ జరగకుండా చేయడం వంటి పనులకు పాల్పడుతున్నందున సర్వీస్ నుండి తొలగించామని అధికారులు తెలిపారు.