Andhra PradeshHome Page Slider

ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభలో తొక్కిసలాట

◆ చంద్రబాబు రోడ్ షోలో విషాదం
◆ 8 మంది మృతి
◆ 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన ప్రసంగిస్తున్న సభలో అపశృతి చోటుచేసుకుంది. అంచనాలకు మించి పార్టీ శ్రేణులు తరలిరావడం చంద్రబాబును చూసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో సమీపంలోని డ్రైన్ లో పడి ఎనిమిది మంది మృతి చెందారు. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఆరు మంది వైద్యశాలలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన కందుకూరులో చోటుచేసుకుంది.

మూడు రోజులపాటు జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం చంద్రబాబు నాయుడు కందుకూరుకు వచ్చారు. అదే రోజు రాత్రి స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు అంచనాలకు మించి కార్యకర్తలు రావటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది చనిపోగా మరి కొంతమంది చికిత్స పొందుతూనే ఉన్నారు.

అయితే చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఈ విషాద సంఘటన చోటు చేసుకోవడంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి క్షతగాత్రులను పరామర్శించేందుకు వైద్యశాలకు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళాక వారి పరిస్థితి విషమంగా ఉందని తెలియటం అప్పటికే పలువురు మృతి చెందటంతో చంద్రబాబు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరచడంతో పాటు మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతులకు గురువారం పార్టీపరమైన లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు బాధిత కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.