చనిపోయిన కొలీగ్ కుటుంబానికి భారీ సాయం..
ఈ కలియుగంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందని ఇలాంటి కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తోటి ఉద్యోగి చనిపోతే ఆయన కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం చేశారు ఏపీ పోలీసులు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణ మూర్తి ఇటీవల వెస్ట్ గోదావరిలోని తణుకు పోలీస్ స్టేషన్‌లో తుపాకీ పేలి మరణించారు. దీనితో ఆయన కుటుంబం రోడ్డు పాలయ్యింది. ఆయనపై ఆధారపడిన వృద్దులైన తల్లిదండ్రులు, 3 ఏళ్లు, ఒకటిన్నర ఏడాది వయసు గల ఇద్దరు చిన్న పిల్లలు, భార్య ఉన్నారు. ఈ ఘటనలో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు పోలీస్ శాఖలోని ఆయన బ్యాచ్‌కు చెందిన మిత్రులు ముందుకొచ్చారు. అందరూ కలిసి రూ.45.68 లక్షల ఆర్థిక సహాయాన్ని వేరు వేరు చెక్కుల రూపంలో కుటుంబానికి అందజేశారు. ఈ సంగతి తెలిసిన అందరూ వారిని ఎంతో మెచ్చుకుంటున్నారు.