కేపీహెచ్‌బీలో రూ.14 కోట్ల భారీ మోసం
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో డిపాజిట్లకు అధిక వడ్డీలిస్తామంటూ ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు(44) అనే వ్యక్తి చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్‌బీ కాలనీలో వెల్ విజన్ అనే పేరుతో సంస్థ ఏర్పాటు చసి, మార్కెటింగ్ మేనేజర్లను నియమించుకుని డిపాజిట్ల పేరుతో దాదాపు 200 మంది నుండి రూ.14 కోట్లు వసూలు చేసి మోసం చేశాడు. రూ.లక్ష డిపాజిట్‌కు 100 రోజులలో రూ.2 లక్షలు తిరిగిస్తామంటూ డబ్బు వసూలు చేశాడు. రకరకాల స్కీముల పేరుతో రూ.6.50 లక్షలకు 121 చదరపు గజాల భూమితో పాటు నెలకు రూ.32 వేలు, మరో పథకంలో రూ.లక్ష డిపాజిట్‌కు నెలకు రూ.20 వేల చొప్పున 10 నెలలు చెల్లిస్తామని జనాన్ని నమ్మించాడు. దీనికోసం బాండు పేపర్‌పై కూడా రాసి సంతకాలు చేసిచ్చారు. కొన్ని నెలలు వాయిదాలు చెల్లించి, ఆపేశారని బాధితులు సంస్థకు వెళ్లి చూడగా, తమలాగే పలువురు డిపాజిట్ దారులు కూడా మోసపోయామంటూ కనిపించడంతో అందరూ కలిసి సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

