కుక్కల బారి నుండి తప్పించుకోవడమెలా.. చిట్కాలు
ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో కుక్కల బెడద ఎక్కువయిపోయింది. కుక్కలు గుంపులు, గుంపులుగా ఒంటరి వ్యక్తులపై, చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. వాటి నుండి కాపాడుకోవడానికి కొన్ని రక్షణ చర్యలు పాటించాలి.
అధిక ఉష్ణోగ్రతలు, భారీ శబ్దాలు, వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కుక్కలు గుంపులు, గుంపులుగా ఉంటాయి. పిల్లలను కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఒంటరిగా ఆడుకోనివ్వకూడదు. సాధారణంగా కుక్కలు గుంపులుగా ఉన్నప్పుడు వాటికి దగ్గరలో వెళ్లకపోవడమే మంచిది. కుక్కలకు ఆహారం దొరకని పరిస్థితులలో దూకుడుగా ఉంటాయి. కుక్కలను కొడుతున్నట్లు దూరం నుండే బెదిరించాలి, దగ్గరగా వెళ్లకూడదు. కుక్కలు మీదికి వస్తున్నట్లు అనిపిస్తే దగ్గరలో ఉండే వస్తువులతో అడ్డుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే చొక్కా తీసి, చేతికి చుట్టుకుని ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాలి. ముఖంపై దాడి చేయకుండా చూసుకోవాలి. అవి వెంటపడుతున్నప్పుడు పరిగెత్తే ప్రయత్నం చేయవద్దు.

కుక్క కరిస్తే ఏం చేయాలి
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కుక్క కరిస్తే, నాటువైద్యం జోలికి పోకూడదు. సొంతవైద్యం అసలే చేసుకోవద్దు. మనల్ని కరిచిన కుక్క మంచిదా, పిచ్చిదా గమనించుకోవాలి. అది నాలుగురోజుల వరకూ బ్రతికుంటే ప్రమాదం లేదు. కానీ చనిపోతే మాత్రం వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి సరైన ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాలి. కుక్క కరిచినప్పుడు ముందుగా గాయాన్ని శుభ్రంగా డెటాల్ నీళ్లతో కడగాలి. పసుపు పెట్టడం, కట్టు కట్టడం వంటి పనులు చేయకూడదు. గాయాన్ని గాలికి ఆరనివ్వాలి. ఆయింట్‌మెంట్ పూసుకోవాలి. వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకోవాలి.