Home Page SliderInternationalNews Alertviral

ఒక చేప జాతి కోసం చైనా ఎంత పని చేసిందంటే…

ప్రకృతి సిద్దమైన జీవజాలాన్ని, ఒక నది సహజత్వాన్ని కాపాడేందుకు చైనా (China) కీలక నిర్ణయాలు అమలుచేస్తోంది. అది ఎంత కఠినమైన, నష్టం కలిగించే నిర్ణయమైనా అమలు చేయగలమని నిరూపించింది. ఒక చేప జాతిని కాపాడడానికి ఇప్పటివరకు 300 డ్యామ్‌ లను కూల్చివేసింది. ఉన్న 373 హైడ్రోపవర్ స్టేషన్లలో 342 చిన్నస్థాయి హైడ్రోపవర్ స్టేషన్ల కార్యకలాపాలు నిలిపివేసింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటోంది. యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైన చిషుయ్‌ హే (రెడ్‌రివర్‌)ను అరుదైన, స్థానిక చేప జాతులకు ఆవాసంగా పరిగణిస్తారు. అలాంటిది డ్యామ్‌లు, పవర్‌స్టేషన్‌ లు ఆ నదీ ప్రవాహాన్ని కట్టడి చేశాయి. గతంలో ఈ నది ప్రవహించిన ప్రాంతాలకు నీరందకపోవడంతో ఆ ప్రాంతాలు ఎండిపోయాయి కూడా. జీవవైవిధ్యం దెబ్బతినడం, కొన్ని జాతులు అంతరించేపోయే దశకు చేరుకోవడంపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళనను వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే చైనా ఈ చర్యలకు పూనుకుంది. యాంగ్జీ స్టర్జన్‌ గా పేరుపొందిన స్టర్జన్ ఫ్యామిలీకి చెందిన చేపను 2022లో అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. గతంలో అది యాంగ్జీ పరివాహక ప్రాంతమంతా కనిపించేది. 1970 నుంచి స్టర్జన్ సంతతి పడిపోతూ వస్తోంది. డ్యామ్‌ల నిర్మాణం, అతిగా చేపలు పట్టడం వంటివి అందుకు కారణాలయ్యాయి.