భయపడుతూ ఎంత కాలం వ్యాపారం చేస్తారు
కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంకెన్ని రోజులు బీఆర్ఎస్‌కు దోచిపెడతారు? సమాజానికి ఉపయోగపడే సేవ చేయరా?” అని నిలదీశారు. “నాపై నిందలు వేసినా ఖండించరా? చైనాతో సంబంధాలు మెరుగుపరిచినా మోదీకి ధన్యవాదాలు చెప్పరా?” అంటూ ప్రశ్నలు విసిరారు. కరీంనగర్‌లో నేడు జరగబోయే గణేశ్ నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో బండి సంజయ్ నిన్న మానకొండూరు చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గ్రానైట్ వ్యాపారులను ఉద్దేశించి నర్మగర్భంగా మాట్లాడారు. “భయపడుతూ ఎంత కాలం వ్యాపారం చేస్తారు? ఇకపై స్వేచ్ఛగా వ్యాపారం చేసే వాతావరణాన్ని నేను కల్పిస్తాను. దానికి ప్రతిగా మీరు సమాజానికి సేవ చేయాలి” అని సూచించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలతో ఖంగుతిన్న గ్రానైట్ అసోసియేషన్ నాయకులు స్పందించారు. మోడీ చైనా పర్యటనతో తమ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయని తెలిపారు. ఇకపై సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వ్యాపారులు స్పష్టంచేశారు.