తెలంగాణలో ఏపీ… కమ్మ, కాపు రాజకీయం ఎలా ఉందంటే!?
కమ్మలు కాంగ్రెస్, కాపులు బీఆర్ఎస్!? మరి జనసేనకు ఓటేసేదెవరు?
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కమ్మ-కాపు రాజకీయం!?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్యాస్ట్ వార్
తెలంగాణలో కమ్మ-కాపు రాజకీయం, పై చేయెవరిది!?
తెలంగాణలో కుల రాజకీయం తప్పదా?
తెలంగాణ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కులాల సంఘర్షణ దేశ వ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేస్తుందని మనం చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. అయితే ఆ కులాలు ఎవరికి ఓటేస్తాయి? ఎందుకు ఓటేస్తాయన్నది మనందరికీ తెలిసిన విషయమే! ఆయా సమస్యలు వచ్చినప్పుడు తమకు పరిష్కారాలు చూపించే వారు గెలవాలని వారందరూ భావిస్తారు. అదేవిధంగా ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కొక్కరికి మద్దతిస్తూ ఉంటారు. ఏ కులం కూడా ఒక పార్టీకి, ఒక వర్గానికి మద్దతిస్తుందని చెప్పడానికి ఏమీ లేదు. కేవలం ఒకటి, రెండు పార్టీలు మాత్రమే దేశంలో అలాంటి పరిస్థితి కారణమయ్యాయి. కానీ మెజార్టీ పార్టీలు కులాలను నమ్ముకుని రాజకీయాలు చేయడం ఎప్పుడో మానేశాయి. ఇవన్నీ రాజకీయాల్లో వర్కౌట్ కావని గ్రహించాయి. అందుకే ఓబీసీలు, ఎస్సీ రాజకీయాలంటూ తాపత్రయపడుతున్నాయ్. అందుకోసమే కులం పరోక్షంగా ఉన్నా ప్రత్యక్షంగా కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నడుమ ప్రత్యేక ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సాక్షిగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయానికి కమ్మ, కాపు కులం ఎలాంటి కల్లోలం రేపుతుందన్నదిపై బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల్లో అలజడి రేగుతోంది.

ఏపీ ఓటర్ల మద్దతు బీఆర్ఎస్‌కా, కాంగ్రెస్ కా?
తెలంగాణలో ఆంధ్ర నేపథ్యమున్న ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆంధ్రా తెలంగాణ నేపథ్యమున్న ఓటర్లు భారీగా ఉన్నారు. వారందరూ కూడా ఆయా పరిస్థితులను బట్టి ఆయా పార్టీలకు ఓటేస్తూ వచ్చారు. టీడీపీకే ఎప్పుడూ వేద్దామని ఆ పార్టీ నుంచి ఉన్నవారే గెలవాలని అనుకోలేదు. అందుకే ఎన్టీఆర్ టీడీపీ పెట్టినా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆయా ఎన్నికల్లో ఆయా అవసరాలను బట్టి సందర్భాలను బట్టి వారు ఓటేశారు కానీ మా వాడు.. మా కులపోడని ఓటేయలేదు. కులం పిచ్చ కొందరికి మాత్రమే ఉంటుందని అనాదిగా రుజవయ్యింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్ మొత్తం చేంజ్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తోంది. రాష్ట్రం విడిపోయినప్పటికీ మనుషులు మాత్రం విడిపోలేదని, పాలు-నీళ్లలా రెండు ప్రాంతాల సామాన్య ప్రజలు కలిసి జీవిస్తున్నారని ఘనత వహించిన గులాబీ నేతలు అవసరాలను బట్టి, సందర్భాన్ని బట్టి చెబుతూ వచ్చారు. అది నిజం కూడా. తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ ఉన్నారు. మరికొందరు బీజేపీకి సైతం జై కొడుతున్నారు.

కమ్మలంతా కాంగ్రెస్‌కు ఓటేస్తే, మరి గాంధీ పరిస్థితో?
అయితే ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదరటం వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనుండటంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఏపీ నేపథ్యమున్న ఓటర్లు ఎక్కువగా ప్రభావితం చూపించే మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలపై గణనీయంగా ఉంటుంది. వాటితోపాటు గ్రేటర్ పరిధిలోని పలు నియోజకవర్గాలపై ఆ ప్రభావం ఉన్నప్పటికీ… రెండు నియోజకవర్గాలు, ఇప్పుడు కుల రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యాయన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఎవరి రాజకీయాలు వారు చూసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి. 2018 ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో దెబ్బతింది. దీంతో తాజా ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీ కూడా చేయకుండా ఏపీపైనే మెయిన్ ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయం తెలంగాణలోని కూకట్‌ప్లలి, శేరిలింగంపల్లిపై స్పష్టంగా పడే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ మంది మెజారిటీ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి జై కొడతామని బాహాటంగా చెబుతున్నారు. వారందరూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు బీజేపీ కారణమని ఆరోపిస్తూ… కుట్రలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉందని ఫీలవుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు తమకు మద్దతివ్వలేదన్న ఆక్రోశం వారిలో ఉంది. అయితే వాస్తవానికి కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదన్న విషయాన్ని మాత్రం వారు పట్టించుకోవడం లేదు. ఆంధ్రా మూలాలున్న ఓటర్లు కొందరైనా తమకు మద్దతిస్తారని… కొందరు కాంగ్రెస్ నేతలు బాబు అరెస్టుపై మాట్లాడారు తప్పించి కీలక హస్తం పార్టీ నేతలు లైట్ తీసుకున్నారు. ఇందుకు కారణం చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే.

పవన్ కల్యాణ్ మాటను కాపులు మన్నించి బీజేపీకి ఓటేస్తారా?
మూడోసారి విజయం సాధించి, తెలంగాణలో హ్యాట్రిక్ సీఎం కావాలని కలలు కంటున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏ వర్గాన్ని, ఏ ఓటును వదులుకునేందుకు సిద్ధంగా లేరు. కాకుంటే నాడు కేసీఆర్, మాటను మన్నించి వర్గాలు ఇప్పుడు లైట్ తీసుకుంటున్నట్టుగా కన్పిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న కాపు ఓటర్లు గత కొద్ది రోజులుగా తాము బీఆర్ఎస్ పార్టీకే జై కొడతామంటూ ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. కమ్మలు కాంగ్రెస్, కాపులు బీఆర్ఎస్.. ఇలా ఎవరి అవసరాలు, సందర్భాలను బట్టి వారు రాజకీయాలు చేస్తున్నారు. గ్రేట్ హైదరాబాద్‌లో ఉన్న కాపు సోదరులు, స్థానిక మున్నురుకాపు సోదరులతో కలిసి గులాబీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి పెద్ద చిక్కు వచ్చి పడింది. కమ్మ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో ఈసారి కాపు, కమ్మ యుద్ధం తప్పదా అన్నట్టుగా సీన్ కన్పిస్తోంది. కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు బండి రమేష్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాగా, బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలమ. మొన్నటి వరకు తనకు విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్న మాధవరం ఇప్పుడు తనకు ఎవరి నుంచి ఎక్కువ ముప్పు వస్తుందోనన్న కంగారులో ఉన్నారు.

ఏపీ కలయికకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి పునాది వేస్తాయా?
ఇక శేరిలింగంపల్లిలో కూడా సీన్ తేడా కొడుతోంది. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కమ్మ సామాజికవర్గం వ్యక్తే కాదు.. ఆయన అఖిలభారత కమ్మ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పటికీ ఆయనను కమ్మ నాయకుడిగా వారంతా భావిస్తారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో కీలక సామాజికవర్గాలైన యాదవ, గౌడ వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో తలపడుతున్నారు. మాదాపూర్‌కు చెందిన స్థానిక కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మరోవైపు మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తనయుడు రవికుమార్ యాదవ్ అక్కడ బరిలో నిలిచారు. అయితే ఇప్పుడు కమ్మ-కాపు వార్ ఎలా అనుకుంటున్నారా? కూకట్ పల్లిలో ఉన్న కమ్మ ఓటర్లు.. తమ కులానికి చెందిన బండి రమేష్‌కు కాకుండా, జనసేన మద్దతిస్తున్న ప్రేమ్ కుమార్ కు ఓటేస్తారా అన్నది చూడాలి. అదే సమయంలో శేరిలింగంపల్లిలో భారీగా ఉన్న కాపు సోదరులు అరికెపూడె గాంధీకి ఎంత వరకు ఓటేస్తారో చూడాలి. ఇప్పటికే కాపు సోదరులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నారన్న భావన కూడా ఉంది. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ రాజకీయం రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతోందా.. లేదంటే సయోధ్య కుదుర్చుతుందా అన్న భావన కలుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగాలనుకుంటున్న తరుణంలో కాపు-కమ్మ రాజకీయం మొత్తం పరిణామాలను రసకందాయంలో పడేస్తున్నాయ్.

కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతిస్తుందా?
తమ వర్గానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ పవన్ కల్యాణ్ అని భావిస్తున్న పాతకాపులు ఇప్పుడు, మొత్తం పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల, తెలంగాణలో తాము బీఆర్ఎస్ పార్టీతో సఖ్యతగా ఉంటూ సానుకూల ఫలితాలు సాధిస్తున్నమన్న భావనతో ఉన్న వారికి ఇప్పుడు చిక్కొచ్చిపడింది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో అన్ని రకాల కాపు ఓట్లు సుమారుగా 60-70 వేల వరకు ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కమ్మ ఓట్లు సైతం 30-35 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బరిలో నిలుచుండటంతో… కాపులంతా వన్ సైడ్ గా ఓటేస్తారా లేదంటే బీఆర్ఎస్ వైపు చూస్తారా అన్నది చూడాల్సి ఉంది. కాపులు తమ కులం నుంచి పోటీ చేస్తున్న ప్రేమ్ కుమార్‌ను కాదని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అనుమానమే. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి భావిస్తున్న కమ్మ ఓటర్లు మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారన్నది చూడాలి. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో నాయకుడిగా చలామణి అయిన… బండి రమేష్.. కాంగ్రెస్ పార్టీ పాపులార్టీని నమ్ముకొని మాత్రమే రాజకీయం చేయాల్సిన పరిస్థితి. కమ్మ, కాపు వర్గాలతో మొదట్నుంచి సఖ్యత ప్రదర్శిస్తున్న మాధవరం కృష్ణారావుకు ఇప్పుడు అసలు సిన్మా కన్పిస్తోంది. కులం ఓట్లను కుమ్మరిస్తాయని, మా వాడు కాబట్టే ఓటేశామన్న భావన తగ్గుతున్న నేపథ్యంలో ఈసారి గ్రేటర్ హైదరాబాద్ సాక్షిగా జరుగుతున్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి రాజకీయం కేవలం తెలంగాణ రాజకీయాలనే కాదు… ఏపీ రాజకీయాలను అటు ప్రభావితం చేయొచ్చు. టీడీపీ-జనసేన పొత్తుపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏపీలో తమకు కలిసి పనిచేస్తున్న జనసేనానికి మద్దతుగా ఆ పార్టీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతివ్వాలని టీడీపీ కోరితే రాజకీయం కొత్త పుంతలు తొక్కడం ఖాయం.

