Home Page SliderInternationalNews Alert

చైనా అతి పెద్ద ప్రాజెక్టు..భారత్‌కు ఎంత ప్రమాదమంటే?

ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్‌ నిర్మాణానికి చైనా సిద్ధపడిందని అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. టిబెట్ తూర్పున యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించనున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని అక్కడి పవర్ కార్పొరేషన్ అంచనా వేసింది. టిబెట్‌లో జన్మించిన బ్రహ్మపుత్రా నదిని టిబెట్‌లో యార్లంగ్ జంగ్బోగా పిలుస్తారు. నిజానికి ఈ నదిపై నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్- చైనాల మధ్య ఒప్పందం ఉంది. ఈ బ్రహ్మపుత్రా నదికి వరదలొచ్చినప్పుడు నదీ మట్టం సమాచారాన్ని దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. కానీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన తర్వాత చైనా ఈ సమాచారాన్ని ఇవ్వడం లేదు. దీనితో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధపడడం భారత్‌ను కలవరపెడుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల అస్సాం, అరుణాచల్ రాష్ట్రాల ప్రజలు వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అలాగే వర్షాకాలంలో భారీగా వచ్చిన వరదను ఒకేసారి విడుదల చేస్తే ఈ రాష్ట్రాలు ముంపుకు గురవుతాయి. దీనితో దీనిని చైనా వాటర్ బాంబ్ అని పిలుస్తున్నారు.