హోటల్ తాజ్ బంజారా సీజ్…
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా ఆస్తిపన్ను కట్టకపోవడంతో, పన్ను చెల్లించాలని అనేక సార్లు నోటీసులు పంపించినా పట్టించుకోకపోవడంతో రంగలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు హోటల్‌కు తాళం వేశారు. రెడ్ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో హోటల్‌ను సీజ్ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వివరణ ఇచ్చారు. హోటల్ వారు రూ.1.43 కోట్ల ఆస్తిపన్ను చెల్లించాలని నోటీసుల్లో తెలిపారు.కాగా ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహారిస్తోంది. మొండి బకాయిలు చెల్లించని ఆస్తులను బల్దియా అధికారులు సీజ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి రావాల్సిన మొండి బకాయిలు రూ.9,800 కోట్లు కాగా, ఆస్తి పన్ను చెల్లింపులో ఐదు లక్షల నిర్మాణాలు అలసత్వం వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.2,200 కోట్ల పన్ను వసూలు జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.గ్రేటర్‌లో మొత్తం 23 లక్షల నిర్మాణాల్లో పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య 12 లక్షలు మంది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో లక్షా 8 వేల ఆస్తుల సంబంధించి రూ.320 కోట్లను జీహెచ్‌ఎంసీ వసూలు చేసింది. ఆస్తి పన్ను వసూలుపై అధికారులకు బల్దియా కమిషనర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మార్చి 29లోగా మొండి బకాయిలు వసూళ్లు చేయాల్సిందేనని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి టార్గెట్ విధించారు.

